Total Pageviews

Saturday, April 23, 2011

లాలనుచు నూచేరు లలనలిరుగడల

లాలనుచు నూచేరు లలనలిరుగడల 
బాలగండవీర గోపాలబాల

ఉదుట గుబ్బల సరము లుయ్యాల లూగ 
పదరి కంకణరవము బహుగతులమ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ 
ముదురు చెమటల నళికములు తొప్పదోగ

సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక 
మలయ రవళులకు బహుమాఱును బెళంక
కొలది కోవిగములు క్రోలుమదనాంక 
ములగ్రేణిసేయ రవములు వడిదలంక

సరుస పదములు జంగ చాపుచేబాయ 
గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ
కరమూలములు కాంతి కడుజాయజేయు 
సరస నురుకుసుమ వాసనలెదురుడాయ

కొలది నునుమేనుల కూనలసి యాడ 
మెలకువతోనొకరొకరి మెచ్చి సరియాడ
తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ 
అలరి యెల్లరు మోహనాకృతులు చూడ

లలిత తాంబూల రసకలితంబులైన 
తళుకు దంతములు కెంపుల గుంపులీన
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన 
చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన

మలయ మారుత గతులు మాటికి జెలంగ 
పలుకు గపురపు తావి పైపై మెలంగ
పలుగానలహరి యింపుల రాల్గరంగా 
బలసి వినువారి చెవి బడలిక దొలంగ

లలనా జనాపాంగ లలిత సుమచాప 
జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్వప్రదీప 
భళిర గండపరేశ పరమాత్మరూప 

ముఖ్యపదాల అర్ధం:

లాలనుచు: లాలి లాలి అంటూ
నూచేరు: ఉయ్యాలను ఊపుతున్నారు
లలనలిరుగడల =లలనలు+ఇరు+కడల : రెండు చివరలా స్త్రీలు  
బాల వీర: వీరబాలుడా  
గండ గోపాలబాల: చాలా శక్తివంతమైన, ధైర్యవంతుడవైన గోపాలురి బాలుడా 

ఉదుట: ఉద్ధతి, Bigness, vigour, weight
గుబ్బల: స్తనములు, పయోధరములు పై 
సరములు:  
హారములు (A row or string (of pearls)) 
ఉయ్యాల లూగ: ఉయ్యాలలూగినట్లుగా ఊగిసలాడుచుండగా 
పదరి: చలించు
కంకణరవము: కంకణాల ఘల్ ఘల్ మనే మోత
బహుగతులమ్రోగ: అనేక విధములుగా మ్రోగుచుండగా
వొదిగి: అందముగా అమర్చి పెట్టుకున్న
చెంపల కొప్పులు: కపోలము పై నున్న జడ కొప్పులు
లొక్కింత వీగ: కొంచెం వదులై 
ముదురు చెమటల: బాగా ఎక్కువగా పట్టిన చెమటలతో
అళికములు: లలాటములు, ఫాలభాగములు
తొప్పదోగ: తోగు+తోగు = తడిసి ముద్దై పోయినవి (To plunge, to be drenched)

సొలపు: నిస్త్రాణ, పారవశ్యము, మూర్ఛ, బడలిక. సొలపుచూపు Languishment, swooning, faintness. (ఇక్కడ పారవశ్యము అనే మాట సరిపోతుంది)
తెలిగన్నుగవ: ప్రకాశవంతమైన జంట కన్నుల (The whites of the eyes: staring eyes: upturned eyes that shew the white)
చూపులిరువంక: చూపులు రెండువైపులా (అంటే ఉయ్యాల అటూ, ఇటూ ఊగుతున్నప్పుడు, పారవశ్యంతో ఆ బాలుని మోహనాకృతిని తమ ప్రకాశవంతమైన కన్నులతో తదేకంగా అటూ, ఇటూ తిప్పుతూ చూస్తున్నారన్నమాట)       
మలయు: తిరుగు To wander, roam,  
రవళులకు: ధ్వనులకు
బహుమాఱును: ఎక్కువ సార్లు
బెళంక: బెదురుతూ
కొలది: కొద్ది, పరిమితి
కోవిగములు: 
క్రోలు: త్రాగు
మదనాంకముల: మదన చేతులు (దూలముమీది అంగదారవులు, ఇంటికురుజులమీదవేయు. పట్టెలు)
గ్రేణిసేయ రవములు: శ్రేణి??? (వరుసలు చేయు ధ్వనులు)
వడిదలంక: 

సరుస పదములు: అందమైన పాదములు 
జంగ చాపుచేబాయ: అటూ ఇటూ అంగగా చాపి 
మీగాళ్ళ: (మీదు + కాలు.) n. The upper part of the foot, పాదముమిది పైభాగము
గుచ్చెళ్ళరాయ: చీర కుచ్చిళ్ళు రాసుకొనగా 
కరమూలములు: చేతి చివరలు
కాంతి కడుజాయజేయు: మిక్కిలి కాంతులను వెదజల్లుచున్నవి 
సరస: సమీపము, దాపు (Nearness, proximity)
నురుకుసుమ: మరువపు ఆకులు/పువ్వులు??
వాసనలెదురుడాయ: 

కొలది: పరిమితిగా
నునుమేనుల కూనలు: నున్నటి శరీరాల అంగనామణులు 
అలసి యాడ: అలసిపోతూ ఆడుతూ   
మెలకువతో: కడు జాగరూకత తో
నొకరొకరి మెచ్చి: ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ
సరిగూడ: సరిగా కూడుకుని (కలసి)  
తలలూచి: తలలు ఊపుతూ
చొక్కి: పరవశముతో
చిత్తరు బొమ్మలాడ: ఉయ్యాలకు కట్టిన చెక్క బొమ్మలు ఆటలాడగా
అలరి యెల్లరు: మిక్కిలి సంతోషము పొందుతూ అందరూ 
మోహనాకృతులు చూడ: సుందరమైన నీ ఆకృతిని చూస్తున్నారు

లలిత: మనోజ్ఞమైన, సుందరమైన 
తాంబూల రసకలితంబులైన: ఎర్రని తాంబూల రసములు కూడుకొనిన   
తళుకు దంతములు: మెరిసే దంతములు
కెంపుల గుంపులీన: ఎర్రని కెంపు మణుల గుంపులు వలే 
మొలక: మొలిచినవంటి
వెన్నెల డాలు: వెన్నెల కాంతి
ముసురు కొనితోన: తమ నవ్వులలో నింపుకుని   
చెలగి: ప్రకాశించుచూ
సెలవుల: పెదవి మూలలలనుండి
ముద్దు చిరునవ్వులాన: ముద్దులోలికే చిరునవ్వులతో
  
మలయ మారుత గతులు: అత్యంత సువాసనల ప్రదేశములు  (fragrant breeze) 
మాటికి జెలంగ: మరల మరల ఉద్భవించనున్నది
గపురపు తావి: కర్పూరపు పరిమళములు 
పైపై మెలంగ: పై పైన సంచరించుచున్నది
పలుగానలహరి: ఎన్నో పాటల ప్రవాహములో
యింపుల: వినుడానికి చాలా మధురముగా
రాల్గరంగా= రాలు+కరగంగ : రాళ్ళు కరుగుచుండగా 
బలసి: అలసి, సొలసి, 
వినువారి చెవి: వినేటటువంటి అంగనామణుల  
బడలిక దొలంగ: బడలిక/బాధలు పోవుచుండగా

లలనా జనాపాంగ: అంగనామణుల శరీరాలపై
లలిత సుమచాప: మృదువైన పువ్వుల బాణము వంటివాడా 
జలజలోచన దేవ: కలువ కన్నుల దేవా
సద్గుణ కలాప: మంచి గుణముల సమూహములు కలిగిన వాడా
తలపు లోపల: ఆలోచనలోపన 
మెలగు తత్వప్రదీప: ప్రకాశవంతమైన తత్వరూపంలో సంచరించేవాడా
భళిర గండపరేశ: ఓ బాలశూరుడా భళి భళి (Mightiest lord)
పరమాత్మరూప: పరమాత్మ స్వరూపుడా 

భావం:
బాలకృష్ణుని ఉయ్యాలలో పరుండబెట్టి గోపికలంతా లాలి లాలి అంటూ పాడుతున్న సన్నివేశాన్ని అన్నమయ్య ఎంత అందంగా, అపురూపంగ భావచిత్రీకరణ గవించారో చూడండి.

ఓ బాలగండవర గోపాలబాల ! అపురూపమైన అంగనామణులు ఉయ్యాలకు రెండు వైపుల నిలబడి లాలి లాలి అని లాలిపాటలు పాడుతూ పరవశించిపోతూ నిన్ను ఊచుచున్నారు.

ఉయ్యాలను ఊపుచున్న అంగనామణులు ధరించిన ముత్యాల హారములు వారి బరువైన చన్నులపై అసియాడుచున్నవి. వారు చేతులకు ధరించిన కంకణాలు కదులుతూ ఘల్ ఘల్ మని మ్రోతలు చేస్తున్నాయి. అందముగా అమర్చి పెట్టుకున్న వారి జడకొప్పులు కొంచెం వదులై చెంపల పైకి జారుతున్నాయి. ఉయ్యాల ఊపుటలో బాగా అలసి వారి నుదురులు చెమటలు పట్టి తడిసి ముద్దై పోతున్నారు.

ఉయ్యాల అటూ, ఇటూ ఊగుతున్నప్పుడు, పారవశ్యంతో ఆ బాలుని మోహనాకృతిని తమ ప్రకాశవంతమైన కన్నులతో తదేకంగా అటూ, ఇటూ తిప్పుతూ చూస్తున్నారు. ఉయ్యాల దూలమునకు వేసిన కురుజులు కిర్రు, కిర్రు మని ధ్వని చేస్తున్నప్పుడు కొంచెం బెదురు చూపులు చూస్తూ జాగ్రత్తగా ఊపుచున్నారు. (అంటే...ఉయ్యాల కురుజులు ఎక్కడ ఊడిపోతాయో అని భయం వల్ల కావచ్చు)

వారి అందమైన పాదాలను అంగలుగా వేస్తూ బాగా సాగుతూ ఉయ్యాల ఊపుతున్నారు. బాగా సాగడం వల్ల వారి చీర కుచ్చిళ్ళు  రాసుకుంటున్నాయి. ఊచుటలో వారి చేతి చివరలు కాంతులు ప్రసరిస్తు న్నాయి. (ఈ కాంతులు చేతులకు ధరించిన కంకణాల వల్లనేమో). వారి నల్లని బరువైన కొప్పులలో దాల్చిన మరువపు ఆకుల పరిమళాలు అన్ని దిక్కులలో వ్యాపిస్తున్నాయి.

అతి మెత్తని వారి నున్నని వారి శరీరాలు అలసిపోతూ ఆడుచున్నాయి. మిక్కిలి జాగరూకతతో ఒకరినొకరు మెచ్చుకొనుచు సరిగా కలసి ఊపుచున్నారు. ఉయ్యాలకు కు కట్టిన చెక్క బొమ్మలు పరవశంతో తలలూచి ఎగురుచున్నవి. అందరు నీ మోహనాకృతిని తదేకంగా చూచుచు ఊపుచున్నారు.    

ఈ అంగనామణులు తాంబూలం వేసుకున్నారు. మనోజ్ఞమైన తాంబూల రసముల వల్ల వారి మెరిసే దంతములు ఎర్రని కెంపుల మణుల సమూహముల వలే ఉన్నవి. అనిర్వచనీయమైన ఆనందానికి లోనై వారి పెదవి మూలలనుండి వచ్చే ముద్దులొలికే చిరునవ్వులు వెన్నెల కాంతులను చిమ్ముచున్నవి.

అత్యంత సువాసన భరితమైన మలయమారుతము గతులు మారుతూ వీచుచున్నది. కర్పూరపు పరిమళము చిమ్ముచున్నది. వారు పాడేటటువంటి పాటల ప్రవాహములకు రాళ్ళు కరుగుచున్నవి. ఉయ్యాల ఊచుటవల్ల అలసిన వారి చెవి బాధలు, అలసట అంతా ఈ పాటలు వినినంతనే పోవుచున్నవి.

అంగనామణుల నున్నటి శరీరాలపై మృదువైన పువ్వుల బాణము వంటి వాడా, కలువ కన్నుల దేవా, మంచిగుణముల సమూహములు కలిగినవాడా, ఆలోచనలోపల ప్రకాశవంతమైన తత్వరూపంలో సంచరించేవాడా, ఓ బాలశూరుడా, పరమాత్మా..భళి భళి...


ఉయ్యాల ఊపడానికి ఎందుకింత కష్టపడుతున్నారనుకుంటున్నారా! ఐతే ఆ ఉయ్యాల స్వరూపాన్ని తెలుసుకోవాలంటే "అలర చంచలమైన ఆత్మలందుండ అలవాటు సేసెనీ ఉయ్యాల" అనే కీర్తన చదవండి. త్వరలో ఆ కీర్తన అర్ధన్ని కూడా వివరించే యత్నం చేస్తాను.

ఈ కీర్తన ఇక్కడ వినండి.  
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/27lalanuchu-nucheru.html


2 comments:

  1. You grabbed my attention sir.. Thanks for your great and good explanation and the way you thought for others..👍👍👏🙏

    ReplyDelete
    Replies
    1. Hello Veena Garu, Thank you so much. Glad that you liked it. All of us are grabbed by Annamacharulu. We are blessed to listen and understand his keerthanaas.
      Best Wishes,
      Kiran

      Delete