ప|| ఎవ్వరెవ్వరివాడో- యీజీవుడు -
నెవ్వరికి నేమౌనో -యీజీవుడు ||
చ|| ఎందరికి గొడుకుగా- డీజీవుడు వెనుక-
కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ- డీజీవుడు దుహ్ఖ-
మెందరికి గావింప -డీజీవుడు ||
చ|| ఎక్కడెక్కడ దిరుగ- డీజీవుడు వెనుక-
కెక్కడో తనజన్మ- మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు- నీజీవుడు యెప్పు-
డెక్కడికి నేగునో -యీజీవుడు ||
చ|| ఎన్నడును జేటులే-నీజీవుడు వెనుక-
కెన్నిదనువులు మోవ- డీజీవుడు |
యెన్నగల తిరువేంక-టేశు మాయల దగిలి
యెన్నిపదవుల బొంద- డీజీవుడు ||
భావం:
ఈ సంకీర్తనం అన్నమాచార్యుల తత్వచింతనకు తార్కాణం.
ఎవరి ఎవరి వాడు ఈ జీవుడు ?. ఎవరికి ఏమౌతాడు? ప్రాణం ఉన్నంతవరకూ నలుగురితో మాట్లాడుతూ, ప్రేమిస్తూ, ఎందరికో ఎన్నో అయ్యే ఈ జీవుడు మరణించగానే ఎవరికీ ఏమీ కాడు.
ముందటి జన్మలలో ఎంతమందికో కొడుకు, ఎంతమందికో తోబుట్టువు ఈ జీవుడు. ఎందరితోనో బాంధవ్యాన్ని ఏర్పరచుకుని వారందరికీ భ్రమ కలిగించాడీ జీవుడు. ఎవరికీ చెప్పకుండా తన శరీరాన్ని వదిలేసి ఎంతో మంది తన వారి దు:ఖానికి కారణమయ్యాడీ జీవుడు.
శరీరం విడిచిపెట్టిన తర్వాత, ఎక్కడకి వెళ్ళాలో తెలియక, చేసిన పాపరాశి తనను వెంటాడుతుండగా, ఆత్మరూపంలో, ఆధారహీనుడై, అనేక లోకాలలో తన ఉనికిని వెతుక్కుంటూ తిరిగినవాడు ఈ జీవుడు. తన మొదటి జన్మ ఎక్కడో తెలియని వాడు ఈ జీవుడు. తనకు తెలియకే ఎన్నో జన్మములెత్తిన వాడు. తానున్న శరీరానికి కూడా తాను చుట్టము కానివాడు ఈ జీవుడు. (చెప్పాపెట్టకుండా, తనకే తెలియకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు కదా!! ఆ ఉద్దేశ్యంలో అలా రాసి ఉంటారు). ఎప్పుడు ఎక్కడకి వెళ్తాడో తెలియని వాడు ఈ జీవుడు. (మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు స్థూలశరీరం మాత్రమే సేద తీరుతుంది. సూక్ష్మ శరీరం ఎక్కడెక్కడో తిరిగివస్తుంది. ఎన్నో ప్రదేశాలు చూసి వస్తుంది. మనం ఎప్పుడూ చూడని ప్రదేశాలు మన కలలోకి వస్తాయి. తెలియని, పరిచయం లేని మనుష్యులు కనబడతారు. కానీ స్థూల శరీరం మాత్రం అచేతనంగా పడుకుని ఉంటుంది).
ఈ జీవునికి చావు లేదు. పంచభూతముల వల్ల జీవునికి మరణం లేదు. ఎన్నో జన్మల్లో ఎన్నో శరీరాలు మోసినవాడు ఈ జీవుడు. ఈ జీవుని అవస్థలన్నీ తిరువేంకటేశ్వరుని మాయలు. ఆయన కృప తగిలితే ఎన్నో గొప్ప పదవులు పొందుతాడీ జీవుడు--అమరత్వం, విష్ణుసాయుజ్యం, జననమరణ చక్రం నుండి విముక్తి, వైకుంఠవాసం, అన్నీ...అన్నీ పొందుతాడు.
ఓ జీవుడా! శ్రీ వేంకటేశ్వరుని శరణు వేడు. ఆయన నిరంతర సంకీర్తనం చేసుకో..నీవు ఎన్ని పనుల్లో ఉన్నా హరి చింతన మానకు. నీవు సంపాదించే ధనం, నీవు అనుభవించే సుఖం, మాటల్లో, చేతల్లో మోసం.. ఇవన్నీ ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం మాత్రమే..నీతో (జీవునితో ) పాటు ఈ భూమిమీద నీవు సంపాదించిన వస్తువులుగానీ, ప్రేమలు గానీ, బంధాలు గానీ ఏమీ రావు. నీవు పుట్టుకతో ఏ సిరిసంపదలు తెచ్చావు?. ఏ బంధువులను వెంటబెట్టుకుని వచ్చావు?.అంతెందుకు?, ఈ లోకం లోకి వచ్చేవరకూ నీ తల్లిదండ్రులెవరో నీకు తెలుసా?..అన్నదమ్ములున్నారని తెలుసా??ఈ మోహాన్ని విడిచిపెట్టు.. అన్ని బంధాలనూ, శరీరాన్నీ మోస్తూనే జీవుణ్ణి హరి పరం చేయి....అని అన్నమయ్య హితాన్ని బోధించారు...