//ప// ఆణికాడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా //
//చ// ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుగుదువటవో
యంగడి బేహారి యవి గొనవయ్యా//
//చ// మొల్లమి మాచెలిమోవిమాణికము
అల్లవెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచే
కొల్ల లడిగితట కొనవయ్యా//
//చ// నిడుదల చూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ వదె
యెడయని కాగిట నిటు గొనవయ్యా//
ముఖ్యపదార్ధం:
ఆణికాడు: మర్మజ్ఞుడు A confidant, or confidential friend
జాణ: నేర్పరి, A wit, a genius
ముంగిట: ముదర, మధ్యప్రదేశము
అంగన: స్త్రీ A woman
ఇంగితము: ఉద్దేశ్యము తెలిసికొను
అంగడి: అంగటి ( A shop)
బేహారి: వస్తువులు కొని విక్రయించువాడు (క్రయవిక్రయికుడు) one who buys and sells
మొల్లము: Thickness, సాంద్రత (Density)
నిడుద: Length, నిడుపు, దీర్ఘము
భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య అమ్మవారి చెలికత్తె గా మారి.... స్వామిని, అమ్మవారు అమ్మే వస్తువులను (ఆమె అందచందాలను, ఆమె హావభావాలను) కొనమంటున్నారు.
స్వామీ! నీవు మాయలు తెలిసినవాడవు. మహా నేర్పరివి అని మాకు తెలుసు. సరిగ్గా కొనుక్కో.
అమ్మవారి ఎదపై చెమటలు ముత్యాలపూసల్లా ఏర్పడ్డాయి. ఆంగన కదా! సిగ్గువలన బయటకు చెప్పుకోలేక ఆ ముత్యాల పూసలని లోలోపలే అమ్ముతోంది. నీకన్నీ తెలుసుకదా! మహా జాణవు నువ్వు.. ఆ చెమటలు అక్కడ ఎందుకు వచ్చాయో, వాటి వెనక ఉద్దేశ్యం, వాటి వెల.. నీ వంటి జాణడుకి బాగా తెలుసు. ఓ తెలివైన వ్యాపారీ! అవి కొనవయ్యా!.
[బేహారి అనే పదానికి అన్నమయ్య ఉద్దేశం ఏమిటో, ఈ సంకీర్తన చూడండి.
"వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో - నీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి!
పంచభూతములనెడి పలువన్నె నూలు - చంచలపుగంజి వోసి చరిసేసి,
కొంచెపు కండెల నూలి గుణముల నేసి - మంచిమంచి చీరలమ్మే మారు బేహారి]
(ఆధ్యాత్మికంగా ఐతే, జీవుల పాపపుణ్యాలు, జనన మరణాలు, కర్మశేషాలను లెక్కకట్టి....జీవులతో క్రయవిక్రయాలు చేసేవాడని.....)
మాంచి మందంగా ఉండే మా చెలి పెదవి మాణిక్యము (అంటే ఎర్రని పగడం అన్నమాట) చాలా తక్కువ ధరకి నీకు అమ్మేసింది. ఇదివరకు నువ్వు మన్మధబాణాలు వదిలి చాలా చాలా ఆడిగావుట.. కాబట్టి ఇప్పుడు కొను..
మా చెలి చల్లని, దీర్ఘమైన చూపులు అనబడే నీలపు మాణిక్యములు నీవు ఎంతకి బేరమాడితే అంతకే అమ్మేసింది, అవునా!.
స్వామీ! నా చెలి పరువములో ఉన్న సున్నితమైన స్త్రీ.. నీవు శ్రీవేంకటపతివి. ఆమె భర్తవి. ఆమెకు ఎప్పటికీ విడిపోని కౌగిలిని ఇచ్చి కొనుక్కోవయ్యా!...