Total Pageviews

Monday, December 30, 2013

హరి రసమ విహారి సతు - సరసోయం మమ శ్రమ సంహారీ [Hari rasama vihari satu sarasoyam mama srama samhari]

//ప// హరి రసమ వి - హారి సతు
సరసోయం మమ - శ్రమ సంహారీ

//చ// దయాని వృత - తనుధారి సం-
శయాతిశయ - సంచారీ
కయావ్యజిత వి - కారీ
క్రియావిముఖ - కృపాణధారీ

//చ// సదా మిధ్యా - జ్ఞానీ సతు
మదాలి మతాభి- మానీ
తదాశ్రిత సం-ధానీ సతు
తదాతదా చిం-తాశయనాని

//చ// పరామృత సం - పాదీ
స్థిరానందా - స్వేదీ
వరాలాపవి-వాదిశ్రీ
తిరువేంకటగిరి - దివ్య వినోదీ

ప్రతిపదార్ధం:
హరి: శత్రువులను సంహరించు వాడు
రసమ: అనుభవింపదగిన రుచి
విహారి: విహరించువాడు
సత్: యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన True, good, virtuous. Excellent
సరసోయం: సరసః+అయం= ఈతడు రసజ్ఞత కలిగినవాడు, A gentleman, a man of good taste
మమ: నా యొక్క
శ్రమ = అలసట, ప్రయాసము. కష్టము Labour, toil, trouble, distress, hardship, difficulty, fatigue, weariness
సంహారీ= తొలగించువాడు

దయాని వృత: దయల చేత చుట్టబడిన 
తనుధారి: శరీరమును ధరించినవాడు 
సంశయ= సందేహము, Hesitation, doubt. 
అతిశయ= మించు, ఎక్కువగు (ఉదా: అతిశయోక్తి exaggeration)
సంచారీ= సంచరించువాడు
కయావ్యజిత= వదిలించలేకపోయిన (వదలలేకపోయిన)
వికారీ= వికారరూపము గలవాడు
క్రియ= Doing చేయుట. Act, action. పని 
విముఖ= ఇష్టతలేనివాడు, ముఖము తిప్పుకున్నవాడు, One who has turned away his face
కృపాణధారీ= A sword. కత్తిని ధరించిన

సదా= ఎల్లప్పుడూ
మిధ్యాజ్ఞానీ= సగం సగం జ్ఞానం తెలిసినవాడు (బ్రహ్మచారి, విద్యార్ధి) 
సత్: యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన True, good, virtuous. Excellent
మదాలి=మదాల= గర్వము, Pride, arrogance, lust, frenzy, madness.
మతాభిమానీ= మతము నందు అభిమానము కలవాడు (మతము: ఒక వ్యక్తి బుద్ధి నుండి పుట్టినది) 
తత్ ఆశ్రిత= ఆశ్రయించిన వారిని
సంధానీ= రక్షించు, కలిపేవాడు
తదాతదా: అప్పుడప్పుడు
చింతాశయనాని: బాధల యందు చిక్కిన వారు

పరామృత= వేరే అమృతాన్ని
సంపాదీ= సంపాదించిన వాడు
స్థిరానంద= స్థిరమైన/శాశ్వతమైన ఆనందం కోసం
స్వేదీ= శ్రమించిన వాడు
వరాలాపవివాది= వర+ఆలాప= శ్రేష్టులచే శృత గీతాలలో విశేషంగా వాదింపబడిన/కీర్తింపబడిన
తిరువేంకటగిరి దివ్య వినోదీ= తిరుమల వేంకటగిరిపై దివ్యమైన వినోదం పొందుచున్నవాడు.

భావం: 
ఈ సంకీర్తనలో అన్నమయ్య విష్ణువు దశావతారాలనూ వర్ణిస్తూ సంస్కృతంలో రచించారు. ఎక్కడా అవతారం పేరు ఉచ్చరించకుండా వాటి విశేషాలు మాత్రం గొప్పగా వర్ణిస్తున్నారు.   

అతడే హరి. గరుడవాహనముపై విహరించేవాడు. అతడు సరసుడు. ఆతని పావన నామరసామృత పానమువలన నా అలసట, శ్రమలు పోగొట్టుచున్నాడు.  

1) దయ అనే పొలుసుల చేత శరీరము చుట్టబడిన వాడు (మీనావతారం)
2) సంశయము కలిగినప్పుడు విశేషముగా విస్తరించి సంచరించువాడు. (కూర్మావతారం) (మంధర పర్వతాన్ని దేవతలూ, రాక్షసులూ చిలుకుతున్నప్పుడు పర్వతం నీటిలో మునిగిపోతుండగా వారి సందేహాలను పటాపంచలు చేస్తూ పెద్ద వీపు కలిగిన తాబేలుగా మారి పర్వతాన్ని పైకి ఎత్తి నిలిపినవాడు)
3) వికారమైన రూపాన్ని పొంది, వదిలించుకోలేకపోయినవాడు (చలోక్తి విసురుతున్నారు అన్నమయ్య) (భూమిని తన కోరలపై నిలిపి రక్షించిన వరాహావతారం)
4) కత్తిని చేత్తో పట్టే పనిని ఇష్టపడనివాడు (నరశింహావతారం, వాడి పదునైన గోళ్ళు ఉండగా కత్తులెందుకు?)

5) సగం జ్ఞానం కలవాడిగా బ్రహ్మచారిగా ఉన్నవాడు. (వటువుగా వచ్చిన వామనావతారం) [అప్పుడే పుట్టిన బాలుడైతే అజ్ఞాని. పూర్తిగా వయోవృద్ధుడై, గురువైతే జ్ఞాని. కానీ, కౌమార, యౌవ్వన వయసులో అందరికీ సగం సగం మాత్రమే జ్ఞానం ఉంటుంది. వారే విద్యార్జన చేస్తూన్న బ్రహ్మచారులు]
6) గర్వము కలిగి బ్రాహ్మణమతమునందు అభిమానముతో గొడ్డలి పట్టి రాజులందరినీ హతమార్చి, బ్రాహ్మణులను రాజులుగా చేసిన పరశురామావతారం.
7) ఆశ్రయించిన వారిని రక్షించే రామావతారం.
8) అప్పుడప్పుడు ఆలోచనలలో, బాధలలో చిక్కిన వాడు. (బలరామావతారం). 

9) విశేషమైన గీతామృతాన్ని పంచినవాడు (లేదా) అమృతంతో సమానమైన ఇష్టము కలిగిన వెన్నను దొంగిలించి సంపాదించినవాడు (కృష్ణావతారం)
10) భక్తులకు శాశ్వతమైన ఆనందం కలిగించడానికి శ్రమను పడి స్వేదమును చిందించనున్న వాడు (కల్కి అవతారం)
శ్రేష్ఠులచే విశేషంగా శ్రుత, గీతాలలో వాదింపబడి ప్రతిపాదించబడి తిరువేంకటగిరిపై దివ్యమైన వినోదాన్ని పొందుచున్నవాడు ఆ హరి. 

(బలరామావతారాన్ని అప్పుడప్పుడు బాధలకు చిక్కిన వాడని అన్నమయ్య ఎందుకన్నారో నాకు ఎంత ఆలోచించినా తట్టడంలేదు. బహుశః మద్యం సేవించనప్పుడు ఏమైనా చింతాగ్రస్థుడయ్యేవారేమో, అన్నమయ్య వేసిన ఓ ఎత్తిపొడుపుమాట కావచ్చు)

 ఈ సంకీర్తన  శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/search?q=hari+rasama 

Thursday, December 26, 2013

భావయామి గోపాలబాలం మన స్సేవితం - తత్పదం చింతయేయం సదా [Bhavayami gopala baalam manassevitam]

//ప// భావయామి గోపాలబాలం మన 
స్సేవితం తత్పదం చింతయేయం సదా   //ప//

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా 
పటల నినదేన విభ్రాజమానం 
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం 
చటుల నటనా సముజ్జ్వల విలాసం //ప//

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది 
సుర నికర భావనా శోభిత పదం 
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం 
పరమపురుషం గోపాలబాలం //ప//

ప్రతిపదార్ధం:
భావయామి: భావించుచున్నాను
గోపాల బాలం: బాలుడైన గోపాలుని (కృష్ణుని)
మనస్సేవితం: మనసునందు నిరంతరము సేవింపబడేవానిని
తత్+పదం: ఆతని పదములను (పదం అంటే పాట అని కూడా అర్ధం)
చింతయ:+అయం= ఈతని గురించే ఆలోచిస్తున్నాను
సదా: ఎల్లప్పుడూ

కటి: మొల
ఘటిత: కట్టబడిన, కూర్చబడిన
మేఖలా: మొలమాల, వడ్ఢాణము A zone or girdle
ఖచిత: చెక్కబడిన Inlaid, set 
మణి: నవరత్నాల రాళ్ళు A gem, a precious stone
ఘంటికా: గజ్జెలు (చిన్న చిన్న గంటలు)  
పటల: పటలము= ఇంటికప్పు A roof; thatch 
నినదేన: ధ్వని. మ్రోత A sound, note. 
విభ్రాజమానం: ప్రకాశించుచున్న వానిని 
కుటిల పద ఘటిత: వంపు తిరిగిన పాదములకు కట్టబడిన గంటలతో  
సంకుల: వ్యాపించిన Spread, Crowded
శింజీతేన: భూషణములమ్రోత, Ringing, tinkling.
తం: అతనిని 
చటుల: తిరుగుతూ, చలించు. చంచలము Tremulous. 
నటనా: నర్తించు
సముజ్జ్వల: అగ్ని సమానంగా భాసిల్లుచున్న
విలాసం: ప్రకాశమానమైనవానిని Shining, splendid

నిరత: నిరంతరము
కర: చేతియందు
కలిత:  కూడుకొనిన, పొందబడిన, Having, bearing
నవనీతం: వెన్న
బ్రహ్మాది సుర : బ్రహ్మదేవుడు మొదలగు దేవతల
నికర భావనా: నిజమైన భావనలయందు
శోభిత పదం: ప్రకాశమానమైన పదములు కలిగిన వానిని 
తిరువేంకటాచల స్థితం: తిరు వేంకటాచలము మీద నివాసము ఏర్పరచుకున్నవానిని
అనుపమం: పోల్చదగిన ఉపమానము లేనివానిని
హరిం: హరిని 
పరమపురుషం: పరమపురుషుని
గోపాలబాలం: గోవులను పాలించు బాలుని  

భావం: ఈ సంకీర్తన అన్నమాచార్యుల భావనా సముద్రంలో ఉప్పొంగిన ఒక అల. సంస్కృతభాషలో బాలకృష్ణుని అందాన్ని, ఆయన పనులను భావయామి అని చెప్తున్నారు..

బాలకృష్ణుని పాదాలను నిరంతరం మనస్సులోనే భావిస్తున్నాను. ఆయన పదములను నిరంతరం ఆలోచిస్తున్నాను.

చెక్కబడిన నవరత్నాల రాళ్ళు పొదిగిన, చిన్ని చిన్ని గంటలు కూర్చబడిన మొలత్రాడు ధరించి పాదాలను వంచుతూ నర్తిస్తూ, శరీరంపై ఉన్న భూషణములు కూడా శబ్దాలు చేస్తూండగా అటూ, ఇటూ తిరుగుతూ ఇంటిపైకప్పు దద్ధరిల్లేలా గలగల శబ్ధం చేస్తూ అగ్ని సమానంగా ప్రకాశిస్తున్న బాలగోపాలుని మనస్సులో భావిస్తున్నాను.  

నిరంతరం చేతియందు వెన్నెను పట్టుకున్న వానిని, బ్రహ్మ మొదలగు దేవతల నిరంతర భావనలలో సేవింపబడువానిని, ప్రకాశమానమైన పాదములు కలిగిన వానిని, వేంకటాచలముపై నివాసము ఏర్పరచుకున వాడైన హరిని, పరమపురుషుని, పోల్చడానికి యే ఉపమానాలూ లేనివాడిని, గోవులను పాలించు బాలుని  మనస్సుయందు నిరంతరం భావించుచున్నాను. 

ఈ సంకీర్తనని బాలకృష్ణప్రసాద్ గారి దివ్యగాత్రంలో శ్రావణ్కుమార్ బ్లాగునందు వినండి. http://annamacharya-lyrics.blogspot.com.au/search?q=bhavayami