Total Pageviews

Thursday, August 1, 2013

ఈ వనిత నీకె తగు నెంత భాగ్యమంతురాలో - వేవేలు తెరగుల వెలసీ నీకాగిట [ee vanita neeke tagu nenta]

//ప// ఈ వనిత నీకె తగు నెంత భాగ్యమంతురాలో
వేవేలు తెరగుల వెలసీ నీకాగిట

//చ// జక్కవపిట్టలలోని చక్కదనాలు చన్నులు
నిక్కుగొప్పు రంగైన నీలాల పుట్టు
ముక్కు సంపెంగపువ్వుల మోహనసింగారము
యెక్కడ గాబొగడేము యీయింతి సొబగులు

//చ// చిగురుటాకుల మించు చెలువము కెమ్మోవి
మొగము చంద్రకళలమునిముంగిలి
జగిగలనెన్నడుము సింహపుగొదమ యొప్పు
తగ నెట్టు పోలిచేము తరుణి యంగములు

//చ// మరుని బండ్లకండ్ల మహిమలు పిరుదులు
సరిబాదములు జలజపు సొంపులు
నిరతి శ్రీవేంకటేశ నీదేవులలమేల్మంగ
అరుదులేమని చెప్పే మతివ చందములు

ముఖ్యపదార్ధం:
తెరగు= విధము manner, style 
చన్నులు= స్తనములు
నిక్కు= గర్వము
చెలువము= అందము, విధము
జగిగల=చిక్కిన
బండికండ్ల= కల్లు= రాతితో చేయబడిన చక్రము, రధము చక్రము

భావం:
అన్నమయ్య అమ్మవారి అందాలను వర్ణిస్తూ శ్రీవారితో ఈ వనిత నీకు తగినట్టుంటుంది. ఎంతో భాగ్యవంతురాలంటున్నారు.

ఈ లావణ్యవతి ఎంత భాగ్యవంతురాలో. నీకు సరిగ్గా సరిపోతుంది. వేవేల విధాల నీ కౌగిటలో వెలసింది. 

ఎప్పుడూ జంటగా ఉండే జక్కవ పక్షులలోని చక్కదనాలు ఈ పడతి ముచ్చటైన జంట స్తనములు. ఆ పొగరుగా నిలబడి ఉండే జడ కొప్పు చక్కటి రంగైన నీలమణుల గుట్టలు. ఆమె ముక్కు సంపెంగ పువ్వుతో అలంకరించినట్టుండే అందమైన సింగారము. ఎంతని పొగడగలము ఈ స్త్రీ అందాలు?

ఆమె అందమైన కెంపుల వంటి ఎర్రని పెదవులు లేత చిగురుటాకుల అందాన్ని మించుతున్నాయి. ఆమె మొగము పదహారు కళ చంద్రుడి వలె గుండ్రనిది. చిక్కినట్టుండే ఆ సన్నని నడుము కొదమ సింహము అంటే సరిపోతుంది. ఆమె అంగములను పోల్చడానికి సరైన ఉపమానాలున్నాయా? (ఏదో, ఉన్న వాటితో  చెప్తున్నాను అంతే)

మన్మధుడి రధ చక్రాలవలే గుండ్రని, విస్తారమైనవి మె పిరుదులు. సరే, ఇక పాదాలైతే మెత్తని తామెరల సొంపులే. శ్రీవేంకటేశ్వరా! ఎల్లప్పుడూ నీ వక్షస్థలము పై ప్రకాశించే నీ భార్య,  మా అమ్మ అలమేల్మంగ. ఆమె అరుదైన విలాసాలు ఏమని చెప్పేము.?