//ప// ఆమని పువ్వువంటిది ఆయమైన వయసు
కాంమించి భోగించక యేమరదగునా? //ప//
//చ// చలపాదితనమేల సణగులాడగనేల
బలిమి బెనగేయట్టి పతితోను
పలుకగరాదా కప్రపుబాగా లియ్యరాదా
చెలులకు నింతేసి సిగ్గుపడదగునా? //ప//
//చ// బిగియగ నింతయేల పెచ్చువెరుగగనేల
పగటున దమకించే పతితోను
నగవులు నగరాదా నయములు చూపరాదా
చిగురుమోవితోడ సిగ్గువడదగునా? //ప//
//చ// మరగించనింతనేల మనసులు చూడనేల
పరగ శ్రీవేంకటపతితోను
గరిమెల మెచ్చరాదా కాగిటగూడెనతడు
శిరసువంచుక యట్టే సిగ్గువడదగునా? //ప//
ముఖ్యపదార్ధం:
ఆయము: జీవస్థానము (శరీరములో ముఖ్యమైన అంగము. ఇక్కడ కామము గురించిన వర్ణన కాబట్టి, మర్మస్థానము అని చెప్పుకోవాలి)
ఏమరు: మరచుట
చలపాదితనము: రోషంతో మాట్లాడటము, మాత్సర్యము కలిగి ఉండుట
సణగు: గొణుగుట
బలిమి: బలవంతుడైన, శక్తివంతుడైన
కప్రపుబాగాలు: కర్పూరము, వక్కపొడి (బాగా అంటే వక్క అని అర్ధం) కలిపిన తాంబూలం
పగటు: ప్రకాశించు, ప్రకటించు
తమకించు: మోహము తెలుపు, విరహము అనుభవించే
శృంగార భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీవారి చెలికి హితబోధ చేస్తున్నారు. (శృంగారముతో ఒక అర్ధం, వైరాగ్యంతో ఒక అర్ధం ఉంది ఈ పాటకి)...అన్నమయ్య దృష్టిలో ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులూ శ్రీవారికి చెలులే...ఆయన మనకే చెప్తున్నాడని అన్వయించుకోవాలి..
//ప// యౌవ్వనపు వయసులో అంగము (జీవస్థానము) వసంతకాలంలో వికశించిన పువ్వులాంటిది. అంతటి సుఖమునిచ్చే దివ్యమైన అంగముల సంపద కలిగి ఉన్నావు. వాటితో శ్రీవారితో కామము సలిపి భోగించక వాటిని మరచి ఇలా ప్రవర్తించుట సబబేనా?
//చ// బలవంతుడైన హరి నిన్ను చుట్టేస్తుంటే అలా రోషంగా మాట్లాడతావెందుకు? అలా నీలోనువ్వే గుణుగుతావెందుకు?, మాట్లాడచ్చు కదా, కర్పూరము, వక్క వేసిన తాంబూలం ఆయనకి ఇవ్వచ్చు కదా! ప్రియురాళ్ళు ఇంతేసి సిగ్గుపడవచ్చా?
//చ// నీపై విరహంతో కాలిపోతున్న భర్తని పక్కనే పెట్టుకుని ఎందుకంత బిగుసుకుపోతున్నావు?. పైగా భయపడతావెందుకు?. నవ్వులు నవ్వరాదా, వినయము చూపరాదా? లేత చిగురువంటి పెదవులున్న అమ్మయివి, ఇలా సిగ్గుపడచ్చా?
//చ// స్వామిని ఇంతగా కోరికతో మరగించాలా? ఆయన మనసెలాంటిదో ఇప్పుడా నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నించేది?. అదీ, సాక్షాత్తూ వేంకటాద్రిపై ప్రకాశించే విభుని గురించి. ఆయన నీ కౌగిలిలోకి వచ్చినప్పుడు కొంచెం మెచ్చుకోవచ్చు కదా, అప్పుడు కూడా తలవంచుకుని అలా సిగ్గుపడచ్చా?
వైరాగ్యభావన:
//ప// యౌవ్వనములో ఉండే అందాలన్నీ వసంత కాలంలో పువ్వుల్లా వికసించి వాడిపోతాయి...అటువంటి అందాలు శాశ్వతం అనుకుని శారీరిక సుఖాలకి ఎక్కువ విలువిచ్చి శ్రీవేంకటేశ్వరుని ధ్యానింపక, ఆయన భావములో భోగింపక, ఆయన చింతను మానడం సబబుకాదు అని చెప్తున్నారు.
//చ// స్వామి నిన్ను కరుణిస్తానంటే నువ్వే తెలుసుకోలేకపోతున్నావు, రోషంగా, పొగరుగా మాట్లాడుతున్నావు. నేనేదైనా చేయగలను, అని అహంకారంతో స్వామిని మరచిపోతున్నావు. నీ మనసు అనే తాంబూలం శ్రీవారికి ఇవ్వచ్చు కదా! ఆయన శరణు వేడటానికి అంత సిగ్గెందుకు నీకు?
//చ// స్వామిని చేరడానికి ఎందుకంత బిగుస్తున్నావు? ఈ సంసార సుఖాల్లో మునిగితేలాలనే తాపత్రయంతో నీవు స్వామిని చేరడానికి భయపడుతున్నావు. ఆయన నామస్మరణ చేయరాదా? ఆయన కీర్తనలు పాడరాదా? ఆయన పట్ల వినయంగా ఉండరాదా? కేవలం జననమరణ చక్రాల్లో ఇరుక్కున అల్పజీవుడివి, నీకు స్వామిపట్ల ఈ విధమైన భావం తగునా?
//చ// స్వామి శరణాగత రక్షకుడని నీకు తెలియదా? ఎంతో మందిని రక్షించిన ఆయన పై నీకింకా అనుమానమా? తిరువేంకటాచలముపై కటి, వరద హస్తాలతో ప్రకాశించే స్వామి వెలుగుని తలెత్తి చూడకుండా తలదించుకుని ఈ చీకటిని (తమోగుణాణ్ణి) చూడడం సబబేబా?
విశేషాంశం:
అన్నమయ్య ప్రతీ శృంగార సంకీర్తనలోనూ అత్యున్నతమైన వైరాగ్యం, ఆధ్యాత్మక దాగి ఉన్నాయి..కేవలం, శరీరాన్ని, అంగాలని, కోరికలని చూసేవాళ్ళకి అవే కన్పిస్తాయి...ఉన్నతమైన భావాలున్నవాళ్ళకి అవి పూర్తి వైరాగ్య సంకీర్తనలు..