Total Pageviews

Saturday, May 28, 2011

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి


//ప// ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి 
 కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి 

//చ// కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి 
మెలయు మీనాక్షికిని మీనరాశి 
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి 
చెలగు హరిమధ్యకును సింహరాశి 

//చ// చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి 
కన్నె పాయపు సతికి కన్నెరాశి 
వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తి
న్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి 

//చ// ఆముకొని మొరపుల మెరయు నతివకు వృషభరాశి 
జామిలి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి 
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి 
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిధున రాశి

ముఖ్యపదాల అర్ధం:

ఇన్ని రాసుల: పన్నెండు రాశుల 
యునికి= ఉనికి: ఉండు (Being, existence)
యింతి= ఇంతి: స్త్రీ
చెలువపు రాశి: అందాల రాశి 
 కన్నె: ఈ పడతి
ఈ రాశి కూటమి గలిగిన రాశి : పన్నెండు రాశులు కలిగిన అందాల రాశి

కలికి: అందమైన స్త్రీ
బొమ విండ్లుగల: ధనస్సు (A bow) వంటి కనుబొమ్మలు కలిగిన
కాంతకును: పడతికి
ధనురాశి: ధనూరాశి 
 మెలయు: కలసి ఉండు (To mix, be united)
మీనాక్షికిని: చేప కన్నుల అమ్మాయికి
మీనరాశి: మీన (చేప) రాశి  
కులుకు: శృంగారముగా కదులు (To move gracefully)
కుచకుంభముల: కుండలవంటి స్తనములు కలిగిన
కొమ్మకును: స్త్రీ కి
కుంభరాశి: కుంభ (కుండ)రాశి  
చెలగు: ఒప్పు, ప్రకాశించు (To appear, arise, occur)
హరిమధ్యకును: సన్నని నడుమ కు 
సింహరాశి: సింహరాశి

మకరాంకపు: మకరాంకుడు అంటే మన్మధుడు, మకరధ్వజుడు (An epithet of Manmadha, whose banner is     an alligator)  
బయ్యెద: పైట (ఆదువారు తమ ఎదను కప్పుకొను వస్త్రము)
చేడెకు= చేడియ : a woman or lady, ఆడుది
మకరరాశి: మకర(మొసలి) రాశి   
కన్నె ప్రాయపు సతికి: యౌవ్వనవతి ఐన పడతికి
కన్నెరాశి: కన్నె(పడుచు పిల్ల) రాశి
వన్నెమైపైడి: శరీరపు వన్నె బంగారపు రంగుతో   
  తులదూగు వనితకు: సరిసమానముగా తులతూగే పడతికి
తులారాశి: తుల (త్రాసు) రాశి
తిన్నని : నిట్టనిలువుగా (straight)
వాడి గోళ్ళ సతికి: పదునైన అయుధములు వలే ఉన్న గోళ్ళు కలిగిన స్త్రీకి 
వృశ్చికరాశి: వృశ్చిక (తేలు) రాశి

  ఆముకొను: హెచ్చగు, పైకొను (To increase) 
మొరపుల: మూపురము???
మెరయు నతివకు: మెరిసేటి అతివ (స్త్రీ) కి
వృషభరాశి: (ఎద్దు) రాశి 
జామిలి: మంద్ర స్వరంతో?????
గుట్టుమాటల సతికి: రహస్యపు మాటల పడతికి
కర్కాటక రాశి: కర్కాటక (ఎండ్రకాయ) రాశి 
కోమలపు: మృదువైన (Delicate, soft, bland, blooming, youthful)
చిగురుమోవి: పెదవుల చివరలు లేత చిగురుటాకుల్లా కలిగిన 
కోమలి: సున్నితమైన అమ్మాయికి (A blooming girl)
మేషరాశి: మేష (మేక) రాశి  
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ: ఈ ప్రియురాలు ప్రేమతో వేంకటపతిని కలిసింది కాబట్టి 
మిధున రాశి: మిధున (A couple, a brace, a pair: particularly male and female) రాశి (మిధునము= సంగమము, మైధునము= రతిక్రియ) 

భావం:
అన్నమయ్య అమ్మవారిలో లక్షణాలన్నింటినీ జ్యోతిశ్చక్రంలో ఉన్న రాశులతో పోల్చుతున్నారు. అమ్మ జగన్మాత. అందుకే ఈ పన్నెండు రాశులు ఆమెలోనే ఉన్నాయి. అంతర్లీనంగా ఆలోచిస్తే అన్నమయ్య అమ్మవారి కి అయ్యవారికీ రాశి మైత్రి కుదిరిందని నిరూపిస్తున్నారు. అమ్మవారిలో అన్ని రాశులూ ఉన్నాయి కాబట్టి స్వామి యే రాశిలో పుట్టినా (జననకాలంలో చంద్రుడు యే రాశిలో ఉంటే అది మన జన్మరాశి అవుతుంది) వారిద్దరికీ రాశిమైత్రి అద్భుతంగా కలుస్తుందన్నమాట. ఈ విధంగా ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ జరగదు. అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక తత్వవేత్త మాత్రమే కాదు. పరిపూర్ణ శాస్త్రజ్ఞుడు.

పన్నెండు రాశిల ఉనికీ కలిగిన యువతి ఈ అందాలరాశి. ఇంతకీ అ పన్నెండు రాసులూ ఆమె లో ఎలా కలిగాయంటే..

ఆమె కనుబొమ్మలు విల్లులా (ధనస్సు) వంగి ఉన్నాయి కాబట్టి ఆమెలో ధనూరాశి కలిగింది. 
ఆమె కన్నులు అందమైన చేపల్లా (మీనముల) వలే ఉన్నాయి కాబట్టి ఆమెలో మీనరాశి గోచరిస్తూంది.
ఆ సౌందర్యవతికి శృంగారముగా కులుకుతూ కదులుతూన్న కుండలవలే గుండ్రని కుచములున్నవి కాబట్టి ఆమెలో కుంభ (కుండ) రాశి ప్రతిబింబిస్తూంది. ఆమె తీగలాంటి సన్నని నడుము సింహం నడుము లాగ ఉన్నందున ఆమె లో సింహ రాశి దర్శనమిస్తూంది.

ఆమె వక్షస్థలాన్ని కప్పే పయ్యెద - గాలికి అటూ ఇటూ ఊగుతూ- మన్మధుని జెండా (మకరధ్వజము)- మొసలి చెన్నెలున్న మరుని పతాకం వలే ఉన్నం దున ఆమె లో మకర (మొసలి) రాశి కన్పిస్తూంది. 
ఆమె నిత్యము యౌవ్వనవంతురాలు. కాలము ఆమెలో ఏ మార్పునూ తీసుకురాలేదు (మనం కాలం తో పాటు వృద్ధులమౌతాంకదా! ఆవిడకి ఆ బాధలేదు), కాబట్టి కన్య (యౌవ్వనవతి ఐన స్త్రీ) రాశి ఆమెను ఆశ్రయించింది. 
మేలిమి బంగారంలాతో సరి సమానంగా తూగే మిస మిస లాడుతూన్న బంగారువర్ణపు శరీరం కలిగిన పడతి కాబట్టి ఆమెలో తులా (త్రాసు) రాశి సంతరించబడినది. 
సన్నని పొడవైన వాడి గోళ్ళు కలిగినది కాబట్టి ఆమెలో వృశ్చిక (తేలు) రాశి వెల్లివిరిసింది.   

ఆమె చాలా మృదు మధురంగా పాడగలదు. రిషభాది స్వరాలు ఆమె గొంతులో సుస్వరంగా పలుకుతాయి కాబట్టి ఆమెలో వృషభరాశి ఒనరింది. "సరిగమపదని" లో "రి" అంటే రిషభం కదా!!  
ఎండ్రకాయ (పీత, కర్కాటకం) కాలువ గట్టుల్లో బొరియలు చేసుకుని అత్యంత గుట్టుగా నివశిస్తుంది. అలాగే అలమేల్మంగ స్వామితో కలిసినప్పుడు చాలా గుట్టుగా ప్రణయ రహస్యములు పలుకుతూంటుంది. కాబట్టి కర్కాటకరాశి ఆమెలో ఆవిధంగా భాగమైంది.
మేక ఎప్పుడూ లేత చిగుళ్ళు మేస్తూంటుంది. మేక నోటి వద్ద ఎప్పుడూ లేత చిగుళ్ళుంటాయి. ఈ అలమేల్మంగ కు అధరాలే(పెదవులే) ఎర్రని లేత చిగుళ్ళు లా ఉన్నాయి. కాబట్టి ఈమెలో మేషరాశి మమేకమైంది.
ఆమె శ్రీ వేంకటపతిని కళ్యాణమాడి, ఆయనతో సంగమిస్తే అది మిధున రాశి అవుతుంది.        

ఈ కీర్తన ఇక్కడ వినండి 
http://annamacharya-lyrics.blogspot.com/search?q=inni+rasula
మరింత వివరణకై శ్రీ తాడేపల్లి పతంజలి మహనీయుల  వ్యాఖ్యానం చదవండి.