Total Pageviews

Monday, February 28, 2011

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి

శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి


కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి

ముఖ్యపదాల అర్ధాలు:

సతులాల: పడతులారా, మంచి గుణములున్న స్త్రీలారా
చూడరమ్మ: చూడండి
సోబాన: మంగళప్రదముగా
పాడరమ్మ: పాడండి
కూడుకున్నది పతి: భర్తతో కూడుకుని ఉన్నది (భర్తతో కలసి ఉన్నది)
చూడికుడుత నాంచారి: గోదాదేవి (తమిళంలో లక్ష్మీ దేవి రూపమైన గోదాదేవిని చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట). ఈ చూడికుడుత్త నాచ్చియార్ ను కృష్ణదేవరాయలు సంస్కృతీకరించి "ఆముక్తమాల్యద" అనే కావ్యాన్ని రచించారుట.

శ్రీమహాలక్ష్మియట : ఆమె శ్రీమహాలక్ష్మి, సకల సంపదలకు పుట్టిల్లు
సింగారాలకే మరుదు: సింగారాలకు + ఏమి+అరుదు = సింగారాలకు (సంపదలకు) ఏం లోటు?
కాముని తల్లియట: మన్మధునికి తల్లి
చక్కదనాలకే మరుదు: అందాలకేం లోటు?
సోముని తోబుట్టువట: చంద్రునికి చెల్లెలు
సొంపుకళలకేమరుదు: అందమైన కళలకు ఏం లోటు?
కోమలాంగి: కోమలమైన అంగములు కలది
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

కలశాబ్ధి కూతురట: సముద్రుడి కూతురు
గంభీరలకే మరుదు: గంభీరానికి ఏం లోటు (సముద్రమంత గాంభీర్యంగా ఉంటుందన్నమాట)
తలప: తలచగా
లోక మాతయట: ఈ లోకానికే తల్లి
దయ మరి ఏమరుదు: దయకు ఏం లోటు?
జలజనివాసినియట: పద్మము నందు నివసించునది
చల్లదనమేమరుదు: చల్లదనానికేం లోటు?
కొలదిమీర: పరిమితమైన లేనంతగా
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

అమరవందితయట: అమరులచే వందనములు స్వీకరింపబెడెడిది (దేవతలచే స్తుతింపబడెడిది)
అట్టీ మహిమ ఏమరుదు: మహిమలకెం లోటు
అమృతము చుట్టమట: అమృతానికి చుట్టము
ఆనందాలకేమరుదు: ఆనందాలకేం లోటు?
తమితో: కోరికతో
శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె: వేంకటేశుడు తావె వచ్చి పెళ్ళిచేసుకున్నాడు
కొమెర వయస్సు: యౌవ్వనవతి
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

భావం:
అన్నమయ్య ఈ సంకీర్తనలో అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.

ఓ పడతులారా! గోదాదేవి శ్రీనివాసునితో కలసి ఉంది. చూడండి. శుభప్రదమైన మంగళ గీతికలు పాడండి.
ఆవిడ లక్ష్మి. సకల సంపదలకు పుట్టిల్లు. ఆవిడకు సింగారాలకేం తక్కువ?. ఈ లక్ష్మి రుక్మిణీదేవిగా అవతరించినప్పుడు, మన్మధుడు ప్రద్యుమ్నుడు అను పేరుతో ఆవిడ గర్భాన ఉదయించాడు. అంతటి అందగాడైన మన్మధుడికి తల్లి ఆవిడ. ఆమెకు అందచందాలకు లోటేమిటి? పాల సముద్ర మధనంలో ముందుగా చంద్రుడు, తరువాత లక్ష్మి పుట్టారు. అటువంటి పదహారు కళలున్న చంద్రుడికి సాక్షాత్తూ చెల్లెలు ఈమె. ఈమెకు కళలకు లోటేమిటి? ఈ గోదాదేవి అత్యంత సున్నితమైనది. కోమలాంగి.  

ఈమె పాలసముద్రుడి కూతురు. గంభీరాలకు లోటేమిటి? (సముద్రం గాంభీర్యానికి చిహ్నం కదా!). ఈవిడ ఈ లోకానికే తల్లి. ఈ తల్లి దయకు లోటేమిటి? ఈమె పద్మంలో నివశిస్తుంది. పద్మం ఎల్లపుడూ చల్లని నీటిలో ఉంటుంది. అటువంటి పద్మంలో ఉందే ఈవిడకు చల్లదనానికి లోటేముంది?. అపరిమితమైన గుణ సంపద కలిగినది ఈ గోదాదేవి.

నిరంతరం దేవతలచే స్తుతింపబడేది. అటువంటి ఈమె మహిమలకి ఏం లోటు?. (ఈమె మహిమలు ఏమని చెప్పగలం?). ఈమె సకల ఆనందాలకూ నిలయమైన, మృత్యువును దరిచేరనివ్వని అమృతానికి చుట్టం. (అమృతం కూడా పాల సముద్రం నుండి పుట్టిందికదా! అందుకని ఈవిడకి చుట్టం అన్నమాట). అటువంటి ఈమెకు ఆనందాలకు లోటేమిటి?. యౌవ్వనవతి ఐన గోదాదేవిని కోరికతో శ్రీ వేంకటేశుడు తనంతట తాను వచ్చి పెండ్లాడాడు. 
ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://www.esnips.com/doc/478fd782-3e07-4afb-a4f5-cfeb0606493f/Chudaramma-Satulaara-BKP

Sunday, February 27, 2011

అయమేవ అయమేవ ఆదిపురుషో

అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో-
ప్యయమేవ వటదళాగ్రాధీశయన:
అయమేవ దశవిధైరవతార రూపశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి

అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే
అయమేవ వరదోప్యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు


ముఖ్యపదాల అర్ధం:

అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే
ఆదిపురుషో: ఆదిపురుష: = ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు)
జయకరం: జయములు కలిగించువానిని
తమహం: తం= నిన్ను +అహం= నేను
శరణం: రక్షణ కోసం
భజామి: సేవింపుచున్నాను

అయమేవ ఖలు: ఈతడే కదా (ఖలు = కదా)
పురా: పూర్వము
అవనీధరస్తుసోప్యయమేవ: = అవనీధరస్తు+స:+అపి+అయమేవ = భూమిని ధరించినవాడు అయ్యెను + అతడు + కూడా+ ఈతడే
వటదళాగ్రాధీశయన: = వటదళ+అగ్ర+అధిశయన: = పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు.   
అయమేవ: ఈతడే
దశవిధై: : పది రకాల
అవతార రూపశ్చ = అవతార రూప: + చ : అవతార రూపుడు + మరియు
నయమార్గ: న్యాయ మార్గము నందు
భువిరక్షణం: భూలోక రక్షణను
కరోతి: చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
సతతం: ఎల్లప్పుడూ
శ్రియహ్పతి = శ్రియ: + పతి : లక్ష్మి యొక్క భర్త
దేవేషు: దేవతలయందు
అయమేవ: ఈతడే
దుష్టదైత్యాంతకస్తు: దుష్ట రాక్షసుల అంతకుడు అయ్యెను/అగుగాక (అస్తు = గాక!) 
అయమేవ: ఈతడే
సకల భూతాంతరేష్వాక్రమ్య = సకల+ భూత + అంతరేషు +ఆక్రమ్య : సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నవాడు)
ప్రియభక్తపోషణం: ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని
ప్రీత్యాతనోతి: ప్రేమతో చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
శ్రీవేంకటాద్రౌ: శ్రీ వేంకటగిరి యందు
విరాజితే: విరాజిల్లుతూ, శోభిల్లుతూ
అయమేవ: ఈతడే
వరదోప్యాచకానాం = వరద: + అపి + యాచకానం :  వరదుడు (వరములిచ్చెడి వాడు) + కూడా + యాచకులకు (అడిగినవారికి)
అయమేవ: ఈతడే
వేదవేదాంతైశ్చ = వేద, వేదాంతై: + చ =వేదములచేత మరియు వేదాంతుల చేత
సూచిత: = సూచించబడినట్టి
అయమేవ: ఈతడే
వైకుంఠాధీశ్వరస్తు: వైకుంఠమునకు అధీశుడు అయి ఉన్నాడు. /అగుగాక

భావం:

ఈతడే ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు), సకల జయములు, శుభములు కలిగించు ఈతనిని నేను రక్షణ కోసం సేవించుచున్నాను.
ఈతడే కదా పూర్వము భూమిని ధరించినవాడు,  పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు అతడు కూడా ఈతడే. (ఈ భూమి/సృష్టి మొత్తం నాశనం ఐనప్పుడు, మహా విష్ణువు మరల సృష్టిచేయడానికి ముందు ఒక చిన్న బాలుడు రూపంలో మర్రి ఆకును పడవ గా చేసుకుని దానిపై పవళించినాడు ట. అన్నమయ్య రాసిన సంకీర్తన "తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు" చదివితే మరింత అర్ధం అవుతుంది). ఈతడే  పది రకాల అవతార రూపుడు మరియు న్యాయ మార్గము నందు  భూలోక రక్షణను చేయుచున్నాడు. ఈతడే లక్ష్మికి భర్త. ఎల్లప్పుడూ దేవతల అందరిలోనూ దుష్ట రాక్షసులను అంతం చేసే ఆతడు ఈ తడొక్కడే. ఈతడే సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉండి) ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని
ప్రేమతో చేయుచున్నాడు. (ఈ వాక్యం మరింత అర్ధం అవ్వాలంటే అన్నమయ్య కీర్తన "భూమిలోన పుట్టి సర్వ భూత ప్రాణులకెల్ల జీవసాన మోసేటి దేవుడ నేను" వినండి). ఈతడే శ్రీ వేంకటగిరి యందు శోభిల్లుతూ అడిగిన వారికి వరములిచ్చేవాడు. ఈ వేంకటేశ్వరుడే వేదముల చేత, వేదాంతులచేత సూచించ బడినట్టి ఆ శ్రీమన్నారాయణుడు/ వైకుంఠాధీశుడు అయి ఉన్నాడు.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/search?q=ayameva

నిత్యానంద ధరణీధర ధరారమణ

నిత్యానంద ధరణీధర ధరారమణ
కాత్యాయనీస్తోత్ర కామ కమలాక్ష

అరవిందనాభ జగదాధార భవదూర
పురుషోత్తమ నమో భువనేశ
కరుణాసమగ్ర రాక్షసలోక సంహార-
కరణ కమలాధీశ కరిరాజవరద

భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ

పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంత శృంగారరమణ
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాధ్య సుస్థిరకృపాభరణ

ముఖ్యపదాల అర్ధం:

నిత్యానంద: ఎల్లప్పుడూ ఆనందము గలవాడు (Everlasting, eternal happiness)
ధరణీధర: భూమిని ధరించినవాడు (హరి వరాహావతారమెత్తి భూమిని రక్షించినప్పటి మాట గుర్తుచేయాలనుకున్నారేమో అన్నమయ్య)
ధరారమణ: ధర అంటే భూమి, రమణుడు అంటే అందగాడు, భర్త : భూమికి భర్త
కాత్యాయనీస్తోత్ర: పార్వతీదేవి చే స్తుతింపబడేవాడు
కామ కమలాక్ష: కన్నులు కమలాలవలె ఉన్నవాడు. (ఆ కన్నులు ప్రేమను కురిపించునవి)

అరవిందనాభ: బొడ్డు యందు తామెర/పద్మము కలవాడు
జగదాధార: జగత్ అంతటికీ ఆధారభూతుడు
భవదూర: బంధములు దూరము చేయువాడు
పురుషోత్తమ: పురుషులలో ఉత్తముడు
నమో భువనేశ: భూమికి పతి ఐన నీకు నమస్సులు
సమగ్ర రాక్షసలోక సంహార కరణ: మొత్తము రాక్షసలోకాన్ని సంహారము చేసినవాడు
కరిరాజవరద: కరి=యేనుగు, గజరాజుని రక్షించినవాడు

భోగీంద్రశయన: భోగీంద్రము అంటే పాము. శేషశయన కి పర్యాపదం వాడారు అన్నమయ్య
పరిపూర్ణ: పరిపూర్ణుడూ. అణు,రేణు పరిపూర్ణము గా ఉన్నవాడు
పూర్ణానంద: వెలితిలేని ఆనందము కలిగినవాడు
సాగరనిజావాస: క్షీరసాగర వాసుడు
సకలాధిప: అన్నిటికీ అధిపతి
నాగారిగమన: నాగ+అరి+గమన = పాముకు శతృవు, గరుత్మంతుడు. గరుడగమన అని అర్ధం. అన్నమయ్య పర్యాయపదంగా నాగారిగమన అని వాడారు.
నానావర్ణనిజదేహ: అనేక రంగులు విరజిమ్ము శరీరము గలవాడు
భాగీరథీజనక: గంగా దేవిని తన పాదముల యందు పుట్టించిన వాడు
పరమ పరమాత్మ: పరమాత్మ స్వరూపుడు

పావన: పరమ పావనుడు
పరాత్పర: శ్రేష్ఠులకు శ్రేష్ఠుడు (The Supreme Being, the Almighty)
శుభప్రద: శుభాన్ని అందించువాడు
కాంత శృంగారరమణ: శృంగార పురుషుడు, కాంతాపతి
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో: దయాగుణము నిధిగా గలవాడు ఐన శ్రీవేంకటేశునికి నమస్సులు ,
దేవతారాధ్య: దేవతలచే ఆరాధింపబడేవాడా
కృపాభరణ: కృప, దయను ఆభరణముగా గలవాడు.
సుస్థిర: తిరుమల శిఖరాలపై స్థిరముగా ఉన్నవాడు.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://www.esnips.com/doc/55fdd315-9b1b-42be-8499-723da60fa8cf/Nithyananda

చిత్తజగురుడ వో శ్రీనరసింహా

చిత్తజగురుడ వో శ్రీనరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా

సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుడభయమడిగీనదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా

హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా

ముఖ్య పదాల అర్ధాలు:

చిత్తజగురుడ: చిత్తజుడు అంటే మన్మధుడు, చిత్తజ గురుడు అంటే: మన్మధునికి గురువు/తండ్రి = శ్రీ మహావిష్ణువు
శ్రీనరసింహా: లక్ష్మీ నరశింహా
బత్తిసేసేరు మునులు: భక్తి (తెలుగులో భక్తి కి వికృతి బత్తి, పామరులు వాడే పదము) చేస్తున్నారు మునులు
 పరికించవయ్యా: చూడవయ్యా

సకలదేవతలును: దేవతలంతా
జయవెట్టుచున్నారు:  జయ+పెట్టుచున్నారు= జయ జయ ధ్వానాలు చేస్తూ దీవిస్తున్నారు
చకితులై: భయకంపితులై (Fearful, timid, bashful)
దానవులు: రాక్షసులు
సమసిరదె: సమసిరి+అదె= నశించిరి, చచ్చిరి
అకలంకయగు: అకలంక+అగు = మచ్చలేని, నిర్మలమైన, నిష్కళంకమైన (Stainless, spotless) అంటే అందమైన యువతి
లక్ష్మియటు నీ తొడపై నెక్కె: లక్ష్మి, అటు = లక్ష్మి నీ తొడపై కి ఎక్కి కూర్చుంది
ప్రకటమైన నీ కోపము మానవయ్యా : స్ఫుటమైన, జనులకు భయము కలిగించే నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు: తుంబురులు, నారదులు మొదలగు వారు
దొరకొని పాడేరు : (దొరకు+కొని) = మొదలుపెట్టి పాడేరు (అవకాశము లభించిన వెంటనే సంతోషముగా పాడేరు)
అంబుజాసనుడభయమడిగీనదె: అంబుజాసనుడు+అభయము+అడిగెను+ఇదె =అంబు అంటే నీరు. అంబుజము అంటే పద్మము. పద్మంలో కూర్చునే వాడు బ్రహ్మ. బ్రహ్మగారు అభయం అడిగెను.
అంబరవీధి నాడేరు: అంబరము అంటే ఆకాశము. ఆకాశవీధిన ఆడేరు
యచ్చరలందరుగూడి: అప్సరలందరూ కూడి (అప్సర కి వికృతి అచ్చర)
శంబరరిపుజనక: శంబర అంటే శివుడు, రిపు అంటే శత్రువు. శంబరరిపు అంటే మన్మధుడు. (శివుడు మన్మధుని కాల్చి బూడిద చేశాడు కదా!). ఆ మన్మధునికి తండ్రి విఢ్ణువు. ఆయన మనసులోంచి పుట్టిన వాడు.
శాంతము చూపవయ్యా: శాంతము చూపించవయ్యా

యక్షులును గంధర్వులు హత్తి కొలిచేరదె: హత్తి అంటే యేనుగు అని అర్ధం ఉంది. ఇక్కడ సందర్భాన్ని బట్టి అందరూ కలిసి ( To attach, join)
యక్షులూ, గంధర్వులూ కూడా ముందునుంచీ పాడే వారితో గొంతు కలిపారు అని చెప్పుకోవచ్చు.
చిత్తగించు: విను (listen)
పొగడేరు సిద్ధసాధ్యులు: సిద్ధిని పొందిన మహానుభావులు పొగుడుతున్నారు.
సత్తుగా నీ దాసులము : సత్యముగా (Being, existence) నీ దాసులుగా ఉన్నవారము
శరణు చొచ్చితి మిదె: శరణు కోరుతున్నవారము
యిత్తల శ్రీవేంకటేశ: విస్తారమైన, గొప్పవాడైన శ్రీ వేంకటేశ్వరా
 యేలుకొనవయ్యా: మమ్ము పాలించవయ్యా

భావం:
ఈ కీర్తన మహా విష్ణువు నృశింహావతారంలో వచ్చి రాక్షసులను సంహరించిన తర్వాత ఎంతసేపటికీ కోపము తగ్గక ఉండే భీకరమైన నృశింహాకృతిని చూసి ముల్లోకములు భయకంపితులైన వేళ ఆయనను చల్లబరుస్తూ అన్నమయ్య తాను అక్కడ ఉండి నారశింహుని కోపాన్ని తగ్గించడనికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకుని రాసిన సంకీర్తన గా తోస్తూంది.

శ్రీలక్ష్మీనరశింహా! మునులందరూ నిన్ను భక్తిగా వేడుకుంటున్నారు చూడవయ్యా.  
దేవతలంతా జయ జయ ధ్వానాలు చేస్తూ దీవిస్తున్నారు. రాక్షసులంతా భయకంపిస్తులై చచ్చిపోయారు. అందమైన లక్ష్మీదేవి నీ అంకసీమ  అలంకరించింది(తొడపైకి ఎక్కి కూర్చుంది). జనులకు భయము కలిగించే నీ కోపము మానవయ్యా!.
 తుంబురులు, నారదులు మొదలగు వారు అవకాశము లభించిన వెంటనే సంతోషముగా పాడుతూ నిన్ను, నీ మహిమలను  కీర్తిస్తున్నారు. నీ తనయుడు బ్రహ్మ అభయం కోరుతున్నారు. అప్సరలందరూ కూడి ఆకాశవీధిన నాట్యాలు చేస్తున్నారు. మన్మధుని జనకా శాంతము చూపించవయ్యా!.
యక్షులూ, గంధర్వులూ కూడా తుంబుర నారదాదుల కీర్తనలకు గొంతు కలుపుతున్నారు. అందరూ కలిసి నిన్ను కీర్తిస్తున్నారు.  సిద్ధిని పొందిన మహానుభావులు పొగుడుతున్నారు. విను. నీ దాసులము. శరణు కోరుతున్నాము. విస్తారరూపుడాఇన శ్రీ వేంకటేశ్వరా! మమ్ము  పాలించు స్వామీ.

ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి. 
http://www.esnips.com/doc/236031f8-3a9d-425e-8bde-965ae30b8964/chittajagurudaosrinarasimha

Saturday, February 26, 2011

మనుజుడై పుట్టి మనుజుని సేవించి

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా

జుట్టెడుగడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెడుగూటికై బతిమాలి
పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన

అందరిలో బుట్టి అందరిలో బెరిగి
అందరి రూపము లటుదానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందెనటుగాన

ముఖ్యపదాల అర్ధం:
మనుజుడు : మనిషి
జుట్టెడు కడుపుకై: చిన్న పొట్ట
చొరని చోట్లు: దూరకూడని ప్రదేశాలు (చొరబడలేని ప్రదేశాలు)
పట్టెడు కూటికై: పట్టెడు తిండికోసం
పుట్టిన చోటికే: ప్రతీ జీవి పుట్టే చోటు (స్త్రీ యోని)
పొరలి: కోరుట, ఇచ్చించు, అభిలషించు
వట్టి : ఏమియూలేను, ప్రయోజనము లేని
లంపటము : బాధ, తొందర, ఆయాసము
వదలనేరడు: వదలలేడు, వదల జాలడు

అందరిలో : ప్రతీ జీవిలో (లోపల, బయట, మధ్యలో (ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులన్నింటిలో))
అందరి రూపములు: ప్రతి జీవి రూపము
అటుదానై: అన్నీ తానై
అందమైన: అందగాడైన
శ్రీవేంకటాద్రీశు సేవించి: శ్రీ వేంకటేశ్వరుని సేవించి, కొలిచి, పూజించి
అందరాని పదము: అంత తొందరగా అందరూ అందుకోలేని పదవి (మోక్ష పదము)
అందెను+అటు+గాన: అందుకోవచ్చు/గలరు

భావం:
మనిషిగా పుట్టి మనిషిని సేవిస్తూ ప్రతిదినమూ దుఖం పొందడం ఎందుకు?

ఈ చిన్న కడుపు నింపడానికి చొరబడలేని చోట్లు దూరి, పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడి, ఎంతో మందిని బతిమాలుతూ, తన భార్య వలన కలిగే కామ సుఖానికి (పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి) వెంపర్లాడుతూ ఈ అనవసరమైన / ప్రయోజనం లేని బాధలు వదులుకోలేడు లేడు కదా!.   

అందరిలో ఉన్న, అందరిలో పెరుగుతున్న, అందరి రూపములు తానే అయి ఉన్న అందమైన శ్రీ వేంకటాద్రీశుని సేవించి, అంత సులభంగా అందుకోలేని మోక్షపదాన్ని అందుకోవచ్చు కదా!!

Friday, February 25, 2011

నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ

నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ
నిన్నియును నొనగూడె నింతలోపలనె

సొలపు నీ కడగంటి చూపు హృదయము గాడి
లలినితడు శ్రీవత్సలాంఛనుండాయ
వెలది నిను బెడ బాసి విరహంపు మెయికాక
వలన నీతడు నీల వర్ణుడై నాడు

అదన నీ చనుగుబ్బలను చక్రముల చేత
పదిల పరపుచు చక్రపాణియైనాడు
సుదతి నీ దేహమున సొబగు కుంకుమపుత-
లెదిగి పీతాంబరంబీతనికి నాయ

ఆలింగనాపేక్ష ననయంబు నినుగూడ
లోలుడటుగాన నాలుగు చేతులాయ
శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు
పాలించె నిను నీకె బరితోషమాయ

ముఖ్యపదాల అర్ధం:
నిన్ను గూడిన: నిన్ను కూడిన =నీతో కలసి
నిలువెల్ల: మొత్తం శరీరము (head to foot)
సొంపాయ = సొంపు అయ్యెను: అందము,సొగసు గా అయినాడు (Grace, Elegance)
నిన్నియును = ఇన్నియును
నొనగూడె = ఒనగూడె: సమకూరె
నింతలోపలనె: ఇంతలోనే

సొలపు: నిస్త్రాణ, పారవశ్యము (languishing, swooning, faintness)
నీ కడగంటి చూపు: నీ కనుచివర చూపు (To glance, view sidelong, to look askance)
హృదయము గాడి: మనస్సుకు తగిలి
లలినితడు = లలి + ఇతడు =లలి అంటే ప్రేమతో, క్రమముతో, వికాసము, ఉత్సాహము తో ఇతడు
శ్రీవత్సలాంఛనుండాయ: శ్రీవత్స+ లాంఛనుడు + ఆయె = శ్రీవత్సము అంటే విష్ణువక్షస్థలమందలి మచ్చ (A particular mark, said to be curl of hair, on the breast of Vishnu)
వెలది: స్త్రీ
నిను బెడ బాసి =నిను వెడ వాసి : నిను వదిలి నివసించి
విరహంపు =విరహము
మెయికాక : భరించలేక, తాళలేక (మొయి అంటే నల్లని మేఘము అని కూడా అర్ధం)
నీతడు నీల వర్ణుడై నాడు : ఈతడు (వేంకటేశుడు)నల్లటి రంగును పొందినాడు.

అదన: అధికమైన
నీ చనుగుబ్బలను: నీ చను గుబ్బలు + అను: నీ వక్షోజములు (స్తనములు, పాలిండ్లు) అను (చను అంటే వక్షోజం. గుబ్బ అంటే గుండ్రని)
చక్రముల చేత : చక్రముల చేత (అంటే ఆమె స్తనములు చక్రాల్లా పదునుదేరి గుండ్రంగా ఉన్నాయని చెప్పాలనుకున్నారేమో)
పదిల పరపుచు: భద్రముగా (To secure or take care of)
చక్రపాణియైనాడు: చక్రము పాణి (చేతి) యందు కలవాడు
సుదతి: స్త్రీ (అలమేలు మంగ ఇక్కడ)
నీ దేహమున కుంకుమపుత సొబగు: నీ శరీరమున పూసినటు వంటి కుంకుమపూత వలన వచ్చెడి సొగసు
లెదిగి పీతాంబరంబీతనికి నాయ: ఎదిగి + పీతాంబరం + ఇతనికి+ ఆయ = ఇతనికి పట్టు వస్త్రమైనది

ననయంబు = అనయము : ఎప్పుడూ, నిరంతరము
నినుగూడ : నిను కలసి
ఆలింగనాపేక్ష లోలుడటుగాన:  ఆలింగన + ఆపేక్ష + లోలుడు +అటు +గాన= కౌగిలి కోసం మిక్కిలి ఆశ, కోరిక కలిగినవాడు కాబట్టి
నాలుగు చేతులాయ: నాలుగు చేతులాయె
శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు : మనోజ్ఞమైన, సుందరమైన (Beautiful, graceful, charming, lovely) రూపం కలిగిన శ్రీ వేంకటేశుడు
పాలించె నిను: నిన్ను పాలిస్తున్నాడు
నీకె = ఈకె: స్త్రీ
బరితోషమాయ = పరితోషమాయ: మిక్కిలి సంతోషము అయ్యెను (To rejoice greatly)

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య అద్భుత భావుకతకు నిదర్శనం. శ్రీ విష్ణువు అనగానే శ్రీ వత్సాంకితుడు, చతుర్భుజుడు, పీతాంబరధారి, నీలవర్ణుడు, చక్రపాణి అని మనకి తెలుసు. కానీ ఆయనకి ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయ్?.. వీటన్నిటికీ కారణం అలమేలు మంగ అని అన్నమయ్య అంటున్నారు. అంతే కదా! భర్త గొప్పవాడయ్యేది భార్య సహకారం వల్లే కదా!

అలమేలు మంగ తో అన్నమయ్య అంటున్నారు. నిన్ను కలసినప్పుడు విభునికి కాలి గోళ్ళ లగాయితు, తల వెంట్రుకలవరకూ ఎన్నో కొత్త అందాలు సమకూరుతున్నాయి. మరింత అందంగా కన్పిస్తున్నాడు. నువ్వు మీ ఆయనను సిగ్గుతో తలదించుకుని, పారవశ్యంతో కనుల చివరనుండి చూసినప్పుడు, ఆ కనుల చూపుల నుండి వచ్చిన మన్మధ బాణాలు అతని హృదయాన్ని గుచ్చుకుని, ఆ వక్షస్థలం మీద ఒక మచ్చలా తయారైంది. అప్పటి నుండి అతడు శ్రీవత్సలాంఛనుడు (శ్రీవత్సము అంటే విష్ణువక్షస్థలమందలి మచ్చ) అయినాడు. నిన్ను వదిలి ఉండలేక, విరహతాపాన్ని (ఇక్కడ వేంకటేశ్వరుడు భూమి మీదకు రావడానికి కారణమైన వ్రుత్తాంతాన్ని తెలుసుకోవాలి. భృగుమహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నినప్పుడు, లక్ష్మీదేవి స్వామిని, విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఆమె విరహాన్ని) భరించలేక ఈయన నల్లగా మారిపోయాడు. అంతే కదా! బంగారం రంగులో మిస మిస లాడుతూ, మెరిసిపోతూ అమ్మవారు ఆయన సమక్షంలో ఉంటే, కాంతి ఆమెకు తగిలి పరావర్తనం చెంది, ఈయనపై పడి కొంచెం మెరుస్తూంటాడు. ఆవిడ ఎప్పుడైతే దూరమైందో నల్లని రంగుగా అయిపోయాడు ట.

అతని ఆధీనములో ఉన్న చక్రాల్లాంటి గుండ్రటి నీ అధికమైన స్తనములను జాగ్రత్త పరుస్తూ అతను చక్రపాణి అయినాడు. నీ శరీరమున పూసినటువంటి కుంకుమపూత (కుంకుమ పూత ఎర్రగా ఉంటుంది) వలన వచ్చెడి సొగసు ఇతనికి పట్టు వస్త్రమైనది. ఆ విధముగా పీతాంబరధారి (ఎర్రని పట్టు పంచె కట్టుకున్నవాడు) అయినాడు.

నిరంతరం నిన్ను కలిసి నీ కౌగిలో ఉండాలనుకునే ఆపేక్ష/కోరిక అధికముగా ఉండుటచేత ఆయనకు రెండు చేతులు సరిపోక నాలుగు చేతులు కావలసి వచ్చాయి. అందుకే చతుర్భుజుడైనాడు. మనోజ్ఞమైన/సుందరమైన మూర్తి శ్రీ వేంకటేశుడు ఈ విధంగా నిన్ను పాలిస్తున్నాడు. అమ్మా! ఎంతో సంతోషము అవుతోంది.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి.  
http://www.esnips.com/doc/7fb42f54-f6a7-4d02-90a2-b472917ae0e5/ninnugudinavibhuni_BKP_ChadrajyotiRagam

కొమ్మసింగారము లివి కొలది వెట్టగ రావు

కొమ్మసింగారము లివి కొలది వెట్టగ రావు
పమ్మిన యీసొబగులు భావించరే చెలులు

చెలియ పెద్దతురుము చీకట్లు గాయగాను
యెలమి మోముకళలు యెండ గాయగా
బలిసి రాతిరియు పగలు వెనకముందై
కలయ కొక్కట మించీ కంటీరటే చెలులు

పొందుగ నీకెచన్నులు పొడవులై పెరుగగా
నందమై నెన్నడుము బయలై వుండగా
ఇందునే కొండలు మిన్ను( గిందుమీదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు

శ్రీవేంకటేశువీపున( జేతు లీకెవి గప్పగా
యీవల నీతనిచేతు లీకె( గప్పగా
ఆవల( గొమ్మలు( దీగె ననలు( గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ

ముఖ్య పదాల అర్ధాలు:
కొమ్మ: స్త్రీ (ఇక్కడ అలమేలు మంగ)
సింగారములు: అందాలు, శృంగారములు, అలంకారములు
కొలది వెట్టగ రావు: కొలచుటకు శక్యము కాదు. (అపరిమితమైన అందములు అని అర్ధం)
పమ్మిన: అతిశయించు, ఆవరించు
యీ సొబగులు: ఈ సౌందర్యములు
భావించరే చెలులు: తలచుకోండి చెలులూ

పెద్దతురుము: పెద్ద జడకొప్పు
చీకట్లు కాయగాను: చీకటి కాసినంత నల్లగా
యెలమి: తృప్తివలన
మోముకళలు: మొగము నందలి కాంతులు (brightness of her face)
యెండ గాయగా: ఎండ కాసినట్టుగా
బలిసి: మిక్కిలి బలముగా
రాతిరియు పగలు వెనకముందై: వెనక భాగం రాతిరి వలె(నల్లని కొప్పు వలన), ముందు భాగం పగలు వలే (సంతోషము వలన కాంతివంతమైన ముఖం వలన)
కలయ: అంతటా
ఒక్కట: అకస్మాత్తుగా, ఏకముగా
మించీ: అతిశయించి
కంటిరటే చెలులు: చూసితిరటే చెలులూ

పొందుగ: పొద్దికగా, చక్కగా అమరినట్టి
ఈకె: స్త్రీ
చన్నులు: వక్షోజములు
పొడవులై పెరుగగా : పొడవుగా పెరుగగ
అందమైన నెన్నడుము
బయలై వుండగా: యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము (A slender waist) బయటకి కనిపించుట (ఆకాశమంత నడుమన్నమాట)
ఇందునే కొండలు మిన్ను: ఈమె లోనే కొండలు, ఆకాశము (ఆకాశమంత నడుమన్నమాట)
కిందు, మీదై ఒక్కచోనే: క్రింద ఆకాశమంత నడుము, పైన కొండల వంటి స్తనములు ఒక్కచోటనే
చెందివున్న విదిగో చూచితిరటే చెలులు: చెంది ఉన్నాయి చూచితిరటే చెలులూ

శ్రీవేంకటేశువీపున: వేంకటేశ్వరుని వీపు భాగమున
చేతులు ఈకెవి: ఆవిడ చేతులు (ఈకె అంటే స్త్రీ అని ముందు చెప్పుకున్నాం)
కప్పగా: కప్పి ఉంచగా
యీవల ఈతని చేతులు: ఇటుపక్క ఈయన చేతులు (వేంకటేశ్వరునివి అన్నమాట)
ఈకె కప్పగా: ఆమెను కప్పగా (ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారని)
ఆవల: అవతల
కొమ్మలు, తీగెలు, అనలు, కొనలు : అనలుకొనలుగా ఉండు to bloom, flourish తామరదంపలై పెరుగు, కోమలముగా పెరుగు
చేవదేరీ: బలముగా, ధైర్యముగా, నిండు హృదయముతో
అల్లి: అల్లికొనుట
తిలకించితిరటే చెలులూ: చూసితిరటే చెలులూ

భావం:
అన్నమయ్య ఈ కీర్తనలో అలమేలుమంగ విలాసాన్ని అత్యంత కమనీయంగా వర్ణించారు.
చెలికత్తెలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చెలి అందాలు కొలుచుటకు సాధ్యం కాకుండా ఉన్నాయి. అపరిమితమైన అందాల్లాగ. అతిశయించు ఆ అందాలను తలుచుకోండి చెలులూ!
చెలి జడకొప్పు చీకటి అంత నల్లగా, విభుని కలసిన తృప్తితో వెలిగిపోతున్న మొహం ఎండ అంత ప్రకాశవంతముగా, ముందుభాగం పగలు, వెనక భాగం రాత్రి గా ఒకేసారి అకస్మాత్తుగా రెండూ కలసి అతియయించే ఆమె అందం చూశారటే చెలులూ!
పొడవుగా పెరిగి, ఒద్దికగా అమరినట్టి చన్నులు(స్తనములు), యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము బయటకి కనిపిస్తూ, ఈమె లోనే కొండలు - ఆకాశము, క్రింద - మీద, ఉన్నట్టుగా (పైన స్తనములు కొండలు వలే,
క్రింద నడుము ఆకాశము (అంటే విశాలమైన నడుము అని చెప్పాలనుకున్నారేమో) వలే ఒకేచోట ఉన్నాయన్నమాట) ఎంత ముచ్చటగా ఉన్నాయో చూశారటే చెలులూ!
శ్రీ వేంకటేశ్వరుని వీపును ఆమె చేతులు కప్పి ఉంచగా, ఆతని చేతులు ఆమె వీపును కప్పి ఉంచగా, తామరదంపలై పెరుగు ప్రేమతో (కొలనులో తామెరలు దినదినము ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంటాయో), తీగెలు అడవుల్లో అల్లుకున్నంత బలంగా ఎంత గట్టిగా ఒకరినొకరు వాటేసుకున్నారో చూసితిరటే చెలులూ! 
(మూడవ చరణం చివర కొంత నా భావుకతను కలిపాను. ఏదైనా మార్పులున్న ఎడల తెలియజేయగలరు) 
 
ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి.
http://www.esnips.com/doc/bf21b7c4-cff6-49cd-9ebb-2a8c80fc4384/kommasimgaaramulivi_BKP

Thursday, February 24, 2011

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం

ముఖ్యపదార్ధం:
క్షీరాబ్ధి కన్యక: పాలసముద్రుడి కూతురు
నీరజాలయ: పద్మము ఆలయముగా కలది
నీరాజనం: ఆరతి, మంగళహారతి, నివాళింపు

జలజాక్షి: జలజము అంటే పద్మము/కలువ (కలువ కన్నుల పడతి)
మోము: మొగము
జక్కవ కుచంబులకు: అందమైన వక్షోజములకు (The poetical swan, always described as being in pairs, to which poets liken fair breasts). ఇంకోలాకూడా చెప్పుకోచ్చు. చక్రవాక పక్షుల్లాంటి స్తనాలకు అని.   
కప్పురపు నీరాజనం: కర్పూర హారతి
అలివేణి: స్త్రీ
తురుమునకు: కొప్పు, కొప్పుగా మలచిన పొడవైన జడ (tresses)
హస్తకమలంబులకు: ఎర్రని తామెర వంటి అర చేతులకు
మాణిక్యముల నీరాజనం: మాణిక్యముల హారతి

చరణ కిసలయములకు: కిసలము అంటే చిగురు (A sprout). లేత చిగురు వలే మృదువైన పాదాలకు
సఖియ రంభోరులకు: సఖియ ఊరువులకు ( రంభోరు అంటే అరటి చెట్టు వంటి తొడలు కలిగినది)  
ముత్తేల నీరాజనం: ముత్యాల హారతి
అరిది : అపురూపమైన
జఘనంబునకు: మొల, కటి భాగము, పిరుదులు
అతివ: స్త్రీ
నాభికిని: బొడ్డు
నానావర్ణ నీరాజనం: అన్ని రకాల/రంగుల హారతి

శ్రీవేంకటేశు పట్టపురాణియై: శ్రీవేంకటేశ్వరు హృదయ సామ్రాజ్యమునకు పట్టపు రాణియై
పగటు: ప్రకాశించు
నెగడు: వర్ధిల్లు
సతికళలకును: సతి కళలకు
నీరాజనం: హారతి
జగతిని అలమేల్మంగ ఎల్ల చక్కదనముకు
నిగుడు: నిక్కు, వ్యాపించు
శోభనపు నీరాజనం: (శోభనమ్: అంటే మంగళప్రదం) మంగళప్రదమైన హారతి

భావం:
అన్నమయ్య పద్మావతీ దేవికి అంగాంగ హారతిని అధ్భుతంగా ఈ కీర్తనలో తెలియపర్చారు.
పాలసముద్రం చిలికినప్పుడు పుట్టిన అమ్మాయి (క్షీరాభ్దికన్యక), పద్మాలయ (పద్మాసన స్థితే దేవీ) ఐన శ్రీ మహాలక్ష్మికి నీరాజనము.
కలువ కన్నులు కలిగిన మొగమునకు, అందమైన స్తనసంపదకు కర్పూర హారతి. అలివేణి కొప్పునకు, ఎర్రని తామెరలవలే సున్నితమైన అర చేతులకు మాణిక్యాల హారతి.
లేత చిగురుల వంటి మృదువైన పాదాలకు, అరటి చెట్టువలే నున్నని ఊరువులకు (తొడలకు) ముత్యాల హారతి. చక్రము వలే నున్ను గుండ్రని పిరుదులకు, బొడ్డునకు అన్ని రకాల హారతులు.
శ్రీవేంకటేశ్వరు హృదయ సామ్రాజ్యమునకు పట్టపు రాణియై ప్రకాశింస్తూ పదహరు కళలతో వర్ధిల్లు సతికి నీరాజనం.  ఈ జగతి మొత్తాన్ని వ్యాపించిన అలమేల్మంగ యొక్క మొత్తం చక్కదనములకు మంగళప్రదమైన హారతి. 

(ఈ కీర్తనలు మరింత వ్యాఖ్యానాన్ని ఇక్కడ చూడండి. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEivxKGD7nix86Lbr2N8A9QQXCS6bCb9JTR1_wbIqGdIYyUi4MCPDfByR7ope0Ye8QPXlpRhCOWY9tKQBY128aXXLsKvBA_yqZfFfVi1EXCMAIKpOyjFimWtZ-N90NZFcVsqkcZ6Wx5An2gN/s1600/kshirabdhi.png)
ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://cid-272cd1502e1bbc2c.skydrive.live.com/self.aspx/Annamacharya/kshirabhikanyakaku|_madhyamavati|_bkp|_108.mp3

హరి నిన్ను పిలిచీని అదిగో అమ్మా

హరి నిన్ను పిలిచీని అదిగో అమ్మా
తెరమఱుగికనేల తియ్యవమ్మా

చిత్తరు పతిమ వంటి చెలియా
యిత్తల పతికి విడెమియ్యవమ్మా
కొత్తమెఱుగు బోలిన కోమలి - నీవు
మొత్తమి కూరిమిపతిమోము చూడవమ్మా

బంగారుబొమ్మ వంటి పడతి (నీవు)
అంగవించి పతితో మాటాడవమ్మ
అంగజు శరమువంటి అతివె నీకు
నంగతన మిది యాల నవ్వవమ్మా

చంచుల చిగురు వంటి జవ్వని
కొంచక శ్రీవేంకటేశు గూడితివమ్మా
మించుదమ్మిలోన యలమేలుమంగా
యెంచి యిద్దరును మమ్ము నేలరమ్మా

ముఖ్య పదాల అర్ధాలు:
పిలిచీని: పిలిచెను
తెరమఱుగికనేల: ఇంకా తెర చాటు ఎందుకు

చిత్తరు పతిమ వంటి చెలియా: చిత్తరువు అంటే పటము నందు రాసిన రూపము. ఇక్కడ చిత్తరు పతిమ అంటే చెక్కిన శిల్పంలా ఉండే అమ్మాయీ
యిత్తల పతికి = ఇత్తల =గొప్పవాడైన నీ భర్తకు
విడెమియ్యవమ్మా: విడెము =విడ్యము=విడియెము అంటే తాంబూలము (Betel leaf with areca nut). తాంబూలమియ్యవమ్మా
కొత్తమెఱుగు పోలిన:  క్రొమ్మెరుగు (Fresh brilliancy)
కోమలి: కోమలమైన స్త్రీ, ఆడది
మొత్తమి: ఒళ్ళు విరిచుకుని (To stretch the body through drowsiness)
కూరిమి: స్నేహంతో
పతిమోము చూడవమ్మా: నీ భర్త మొగము చూడవమ్మా

బంగారుబొమ్మ వంటి పడతి: బంగారపు బొమ్మలాంటి స్త్రీ, ఆడది
అంగవించి: ఉత్సాహముగా
పతితో మాటాడవమ్మ: నీ భర్తతో మాట్లాడవమ్మా
అంగజు శరమువంటి అతివె: అంగజుడు అంటే మన్మధుడు. మన్మధబాణము వంటి అతివ (స్త్రీ)
అంగతనము: ????
ఈ యాల నవ్వవమ్మా: ఈ వేళ నవ్వవమ్మా
 
చంచుల చిగురు వంటి జవ్వని: లేత చిగురు వంటి యౌవ్వని (యౌవ్వనములో నున్న స్త్రీ)
కొంచక: సంకోచించక
శ్రీవేంకటేశు గూడితివమ్మా: వేంకటేశు తో కలిసితివి
మించు తమ్మిలోన: మించు అంటే అతిశయించు, ఆక్రమించు: తమ్మి అంటే పద్మము. (పద్మంలో కూర్చున్న)
అలమేలు మంగ: తమిళంలో అలర్ అంటే పువ్వు, మేల్ అంటే మీద, మంగై అంటే: కన్యక. (పువ్వుమీద కన్యక).

భావం:
హరి నిన్ను పిలిస్తున్నాడదిగో అమ్మా! ఇంకా తెరచాటెందుకు?. తియ్యవమ్మా!
చెక్కిన శిల్పంలా ఉండే పడతీ, గొప్పవాడైన నీ భర్త నోటికి తాంబూలాన్నందించు.
కొత్త అందాలతో మెరుస్తూన్న ఉన్న కోమలమైన పడతీ! ఒక్కసారి నీ ముభావపు భావం నుండి బయటపడి ఒళ్ళువిరిచుకుని, నీ పతి మోము కేసి స్నేహ భావంతో చూడవమ్మా!.
బంగారు బొమ్మలాంటి ఓ అమ్మాయీ! ఉత్సాహంగా మీ ఆయనతో మాట్లాడు.
మన్మధబాణం వంటి అతివా, (మన్మధబాణం కోరికలను కలిగించే గుణమునందున, చూడగానే ఆకర్షించే స్త్రీ అని చెప్పుకోచ్చు) కొంచెం మీ ఆయనకేచి చూసి నవ్వు.
లేత చిగురు వలే, లేత యౌవ్వనాలతో ప్రకాశించే పడతీ, సంకోచించక నీ భర్త వేంకటేశుని తో కలువు.
పద్మంలో కూర్చున్న అలమేలు మంగ, శ్రీనివాసులిద్దరూ మమ్ములను పాలించండి.   
ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.  
http://annamacharya-lyrics.blogspot.com/2008/04/467hari-ninnu-pilichini.html

Wednesday, February 23, 2011

నారాయణా నిను నమ్మిన నాకును

నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె

చింతా జలధుల జిక్కిన దాటించ
నంతట నీపాద మదె తేప
కాంతల మోహపు కట్లు తెంచగ
పంతపు నీపాద పరశువు గలిగె

అతిదురితపంక మందిన కడుగగ
మితి నీపాదమే మిన్నేరు
రతి కర్మజ్ఞులు రాజిన నార్చగ (కర్మజ్ఞుల రాగిల నార్పగ??)
వ్రతము నీపాదమే వానయై నలిచె

జిగినజ్ఞానపు చీకటి వాయగ
తగు నీపాదము దయపు రవి
నగు శ్రీవేంకటనాథ నన్నేలగ
మిగులగ నీపాదమే శరణంబు

ముఖ్య పదాల అర్ధాలు:
చింతా జలధులు: బాధల సముద్రములు
తేప: తెప్ప, నావ, పడవ
పరశువు: గొడ్డలి
అతిదురిత: మహా ఘోరమైన పాపము
పంకము: బురద
మిన్నేరు: మిన్ను+యేరు = ఆకాశ గంగ
రతి కర్మజ్ఞుల రాజిన నార్చగ: నిరతము రతి క్రియ యందు నిరతము ధ్యాస నుండిన వారి కామాగ్నిని ఆర్పుటకు
వానయై: వర్షమై
జిగినజ్ఞానము చీకటి: జిగి (Brilliancy), అజ్ఞానము =భయంకరమైన చీకటి (కటిక చీకటి) వంటి అజ్ఞానము
వాయగ: బాయగ = బాపుట, తొలగించుట
దయపు రవి: దయ గల సూర్యుడు
నన్నేలగ: నన్ను రక్షింపగ

భావం:
నారాయణా! నిను నమ్మిన నాకు అనేక కారణాల రీత్యా నీ పాదమే గతి.
బాధల సముద్రంలో ముగిపోయే వేళ నావ రూపంలో వచ్చి నన్ను ఒడ్డుకు చేర్చేది నీ పాదమే. స్త్రీ లపై వ్యామోహం అనే కట్లు తెంచడానికి నీ పాదమే గొడ్డలి వంటిది. మహా ఘోర పాపము అనే బురద అంటినప్పుడు అది కడగడానికి నీ పాదమే ఆకాశగంగ. (గంగ పుట్టిల్లు శ్రీ హరి పాదాలే కదా!). నిరంతరము రతి కాంక్షలో మునిగితేలేవారి కామాగ్నిని చల్లార్చుటకు నీ పాదమే వాన వంటిది. కటిక చీకటి వంటి నా అజ్ఞానాన్ని తొలగించుటక్జు నీ పాదమే సూర్యుని వంటిది. పై వాటన్నిటినుండీ నన్ను రక్షింపగ శ్రీ వేంకటనాధా! నీ పాదమే శరణు నాకు.

ఈ కీర్తన వినుటకు ఈ లింక్ ను ఉపయోగించండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/0ead3875-fc91-4112-ad74-010f436e0ef2/NArAyaNAninunammina_BKP

కందువ మీ నిచ్చ కళ్యాణమునకు

కందువ మీ నిచ్చ కళ్యాణమునకు
అందములాయను అదననివి

కలువలసేసలు కలికికి నీకును
సొలవక చూచేటి చూపులివి
చిలుకుల మొల్లల సేసలు మీలో
నలుగడ ముసిముసి నవ్వులివి

తామరసేసలు తలకొనె మీకును
మోము మోమొరయు ముద్దు లివి
సేమంతి సేసలు చెలీయకు నీకును
చేమిరి గోళ్ళ చెనకు లివి

సంపెంగ సేసలు సమరతి మీకును
ముంపుల వూర్పుల మూకలివి
యింపుల శ్రీవేంకటేశ చెలిగలసి
సంపదఁ దేలితి చనవులివి

ముఖ్య పదాల అర్ధాలు:
కందువ: చమత్కారము, ప్రదేశము, ఋతువు,
నిచ్చ: నిత్యము
అదననివి: అధికమైనవి

సేసలు: తలంబ్రాలు (Raw rice thrown on the heads of the bride and bridegroom during the marriage ceremony)
కలువసేసలు: కలువ తలంబ్రాలు
కలికి: అందమైన
సొలవక: అలుపు లేకుండా (సొలయు అంటే అలసిపోవుట.)
చిలుకు: చల్లుకొనుట, చిందుట, బాణము

నలుగడ: (నలు+కడ) =నలు అంటే నాలుగు దిక్కులు, కడు అంటే మిక్కిలి, అత్యంతము, చివర
చేమిరి: పుల్లమజ్జిగ (పాలను తోడుబెట్టుటకు వాడే మజ్జిగ), తోడంటు
గోళ్ళ చెనకులివి: అంటు, తాకు స్పృశించు, (A dent or mark left by pinching the skin with the nails) = గోళ్ళు గుచ్చుట వలన పడే ముద్ర
తలకొను: సంభవించు
మొరయు: ధ్వనించు

సమరతి: సమానముగా అనుభవించు శృంగారక్రీడ?? (ఉత్సాహపూరితమైన రతి??)  
ముంపుల వూర్పుల మూకలివి: గుంపు చెదిరిపోదగ్గ నిట్టూర్పులలో మునుగుట
యింపు: నచ్చిన,  pleasing, comfortable
సంపదదేలితి: సంపదలందు తేలుట
చనవు: చనువుగా ఉండుట? ( A pet, a favorite)

భావం:
ఈ సంకీర్తన శృంగార రచనకు సంబంధించినగా తోస్తూంది. పద్మావతీ వేంకటేశ్వరుల వివాహసమయంలో, వారిరువురు వివిధ రకాలైన పువ్వులతో తలంబ్రాలు పోసుకునేడప్పుడు అవి వారిరువురి శృంగార జీవితాన్ని ప్రతిబింబించేవిగా ఉన్నట్టు ఊహించుకుని, రచించిన సంకీర్తన.

వేంకటేశ్వరా! మీ ఇరువురి దివ్య నిత్యకళ్యాణమునకు కొన్ని అందాలు అదనముగా చేరినట్టు గోచరిస్తున్నాయి.
నీవు, నీ అందమైన ప్రియురాలు, తలమీద నుండి జారవిడుచుకున్న కలువపూల తలంబ్రాలు అలుపులేకుండా ఎంతసేపైనా మీరిరువురు ఒకరిని ఒకరు చూసుకునే చూపుల్లా ఉన్నాయి. (చూపులు కంటికి సంబంధించినవి కాబట్టి, కళ్ళు కలువల్లా ఉంటాయంటారు కాబట్టి ఇక్కడి తలంబ్రాలు కలువలతో పోల్చారేమో అన్నమయ్య.)
మీరిరువురు తల పైనుండి మొల్ల పూల తలంబ్రాలు జారవిడుచుకున్నప్పుడు, అవి నాలుగు దిక్కులకు చెదరి, మీ ఇద్దరి ముసిముసి నవ్వులను ప్రతిబింబింపజేస్తున్నాయి. (మొల్ల పువ్వులు తెల్లగా ఉంటాయి కాబట్టి, అందమైన నవ్వు అందమైన తెల్లని పలువరస ఉంటే బాగుంటుంది కాబట్టి, ఇక్కడ మొల్లపువ్వులు ఉపయోగించారేమో.)

మీరిరువురు తామెర పువ్వుల తలంబ్రాలు తలపైనుండి జారవిడుచుకునేడప్పుడు మీ ఇద్దరి ముఖాలు రాసుకున్నాయి. అవి మీరిరువురు ఒకరినొకరు ముద్దాడినట్టు గోచరిస్తున్నాయి. (ముద్దు అంటే ఎర్రని దొండపండ్ల వంటి పెదవులు గుర్తొస్తాయి కాబట్టి, పెదవులు ఎర్రగా ఉంటాయి కాబట్టి, తామెర పూలతో పోల్చారన్నమాట.)
మీరిరువురు చేమంతి పువ్వుల తలంబ్రాలు తలపైనుండి జారవిడుచుకున్నప్పుడు వాటికి ఉండే కాడలు గీరుకుని మీ శరీరాలపై గీతల్లా ఒన్ని ముద్రలు ఏర్పడ్డయి. అవి మీరిద్దరూ అతి మోహంతో రతి క్రియ నందు ఒకరి శరీరాలను ఒకరు ఆక్రమించుకుంటూ గోళ్ళతో గుచ్చుకోవడం వల్ల ఏర్పడిన ముద్రల్లా ఉన్నాయి.

(నఖక్షతాలు, దంతక్షతాలు అనేవి శృంగారం తారాస్థాయికి చేరినప్పుడు ప్రేయసీ ప్రియులు గోళ్ళతో గిచ్చుకోవడాలు, ముని పళ్ళతో కొరకడం లాంటివి చేస్తారుట. అవి ఒకరి కోరికను మరొకరికి తెలియజేసే విధానమేమో..ఏదేమైనా ప్రకృతి మనకి చాలా భావాల్ని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా తెలియజేసే గొప్ప శక్తిని ఇచ్చింది. మన ఖర్మ ఏంటంటే...మనకు తెలియదు. ఎవరైనా చెప్తే అవేవో మాట్లాడకూడని విషయాల్లాగ, పెద్ద బూతుల్లా ఫీల్ అయిపోయి దరిద్రంగా ఆలోచించడమే..నిజంగా ఉన్నత మనస్తత్వం ఉన్నవారు అన్నీ సమానం గా తీసుకుంటారు. కామం, క్రోధం, ఇలా అరిషడ్వర్గాలన్నీ మనకు పుట్టుకుతో వచ్చినవే. కామసుఖాన్ని ప్రకృతిలో అన్ని జీవులకీ ఒకేవిధంగా ఉంటుందని అన్నమయ్య చెప్పారు. ఈ సృష్టికి మూలకారణం ఆనందం. కనీసం ఈ ఆనందం కోసమైనా జీవులు సృష్టి యాగం చేసి తమ ఉనికిని చాటుకుంటాయని భావించాడేమో దేవుడు.)  

సంపెంగ పూల తలంబ్రాలు మీ ఇద్దరు అనుభవించు ఎన్నటికీ చెదిరి పోని గుంపుల నిట్టూర్పులలో మునిగిన శృంగార క్రీడ వలె ఉన్నది.
శ్రీ వేంకటేశ్వరా! ఎంతో చనవుతో నీ ఇష్టసఖి తో కలసి సంపదలందు తేలితివి.
 
ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/17900eb1-5ca4-4f78-9eae-26266a449193/KANDUVA-MEE-NITYA-KALYAANAM

Tuesday, February 22, 2011

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా -
కేళీ విహార లక్ష్మీ నారసింహా

ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార
లలిత నిశ్వాస డోలా రచనయా
కులశైల కుంభినీ కుముద హిత రవిగగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా

వివర ఘన వదన దుర్విధ హసన నిష్ఠ్యూత -
లవ దివ్య పరుష లాలా ఘటనయా
వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ
నవనవ ప్రియ గుణార్ణవ నారసింహా

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి
కార స్ఫులింగ సంగ క్రీడయా
వైర దానవ ఘోర వంశ భస్మీకరణ -
కారణ ప్రకట వేంకట నారసింహా

అర్ధం:
ఫాలనేత్ర: నుదుటనున్న కన్ను
అనల : అగ్ని
ప్రబల: మిక్కిలి బలము గల, వర్ధిల్లు, అతిశయిల్లు,
విద్యుల్లత: ప్రకాశవంతమైన మెరుపులు
కేళీవిహార: తిరుగుతూ ఆడుట
నారసింహా: తల భాగము సింహము, మిగిలిన భాగము మనుష్య శరీరము కలవాడు

ఘోర ప్రళయ మారుత: ఘోర ప్రళయకాలపు గాలి
భస్తి: అగ్ని??(గభస్తి అంటే సూర్యకిరణము)
పూత్కార: బుసలు కొట్టుట ( Hissing, snorting, snoring, deep breathing)
నిశ్వాస: ముక్కుద్వారా గాలిని విడుచుట, నిట్టూర్పు
డోలా రచనయా: ఊయల వలె ఊగుట
కులశైల: పురాణాలలో ఏడు కులపర్వతాలు ఉన్నాయని చెప్పబడింది. అవి: ఉదయ, అస్త, హిమ, వింధ్య, మేరు, త్రికూట, లోకాలోక పర్వతాలు
కుంభినీ: భూమి
కుముద హిత: చంద్రుడు
రవి: సూర్యుడు
గగన:ఆకాశము
చలన విధి నిపుణ: కదిలించుటలో నిపుణుడు
నిశ్చల నారసింహా: నిశ్చలుడైన నరశింహుడు

వివర : తెరచుట
ఘన వదన: దొప్పదైన ముఖము/ సన్నివేశాన్ని బట్టి ఇక్కడ భయంకరమైన ముఖము అని చెప్పుకోవచ్చు
దుర్విధ: దుస్ + విధ = చెడ్డపనులు చేసే వారు (దుర్మార్గులు)
హసన: నవ్వడం (ఇక్కడ సందర్భానికి తగినట్టైతే అట్టహాసం చేయుట)
నిష్ఠ్యూత : వేయుట
లవ : లవము అంటే కొంచెం, లవలవము అంటే పగిలిన
దివ్య: దివ్యమైన
పరుష: కఠినమైనది
లాలా: లాలాజలము, ఉమ్మి
ఘటనయా: ఘటనా సమర్ధుడు
వివిధ జంతువ్రాత: వివిధ జంతువుల సమూహాలతో నున్న
భువన: భూమి

మగ్నీకరణ: మండించుట, నాశనం చేయుట,
నవనవ: కొత్త కొత్త
ప్రియ గుణార్ణవ: ప్రియమైన/మంచివైన గుణములుకు సముధ్రం వంటివాడు

దారుణోజ్జ్వల: దారుణ+ఉజ్వల: దారుణంగా వెలుగునది
ధగద్ధగిత: ధగ ధగా మెరిసేది
దంష్ట్రా: కోరలు (భయంకర మైన కోరలు)
అనల: అగ్ని
వికార = వికృతమైన
స్ఫులింగ సంగ క్రీడ = కోరలు ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు వాటి మధ్య పుట్టే నిప్పురవ్వలు స్నేహం చేసుకోవడం
వైరి: శత్రువు
ఘోర దానవ వంశ: ఘోర రాక్షశ వంశ
భస్మీకరణ : భస్మీకరించుట
కారణ ప్రకట: ప్రకటితమైన, తెలియజెప్పే
వేంకట నారసింహా: వేంకట నరశింహుడు

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య రచించిన సంస్కృత సంకీర్తనల్లో అత్యంత గొప్పదైనది గా చెప్పుకోచ్చు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగులగొట్టినపుడు, దైత్య సంహారం కోసం కంభము చీల్చుకుని, ఉగ్రరూపంతో, సూర్యచంద్రులు కన్నులుగా భయంకరమైన అగ్నిజ్వాలలతో, బయటికి వచ్చిన నరసింహస్వామి భయంకరమైన వర్ణన అన్నమయ్య మన కంటితో చూడగలిగేంత అధ్బుతంగా వర్ణించాడు.  

లక్ష్మీ నారసింహా! నుదుటిపైనున్న కంటి నుండి వెలువడే భీకరమైన అగ్నిజ్వాలలు క్షణ క్షణానికీ వృద్ధి చెందుతూ, మెరుపులను కురిపిస్తూ ఆటలాడుకొనే వాడివి.

నారసింహా! నీవు మృదువుగా నిట్టుర్చినా ఆ నిట్టూర్పులో ప్రళయ కాలంలో సంభవించే గాలి ఎంత తీవ్రంగా ఉంటుందో అంత భీభత్సమైన గాలి ఉంది. నిప్పులు రాజేయడానికి అవసరమైన బుస ఉంది. నీ నిట్టూర్పు ఉయ్యాలలా మారి ఏడుకుల పర్వతాలను, భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, ఆకాశాన్ని ఒక ఊపు ఊపుతోంది. నువ్వు మాత్రం నిశ్చలంగా ఉన్నావు.

నారసింహా! నీ భయంకరమైన, గొప్పదైన నోటిని తెరిచావు. దుర్మార్గులను చూసి వికటాట్టహాసం చేస్తున్నావు. నీవు వేసిన ఉమ్మి (లాలాజలం) దివ్యమైనది. అత్యంత కఠినమైనది. ఆ ఉమ్మితో వివిధ రకాలైన జీవ సమూహాలు ఉన్న లోకాలను నాశనం చేయగల సమర్ధుడివి. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త కొత్త గుణాలకు సముద్రం వంటివాడివి.

నారసింహా! నీ కోర పళ్ళు దారుణంగా, భయంకరంగా, ధగధగలాడుతూ మెరుపులు కురిపిస్తూ, ప్రకాశిస్తున్నాయి. వికృతమైన శత్రువులైన భయంకర రాక్షస వంశాలను భస్మం చేయటం కోసం పటాపటలాడుతూ ఒరుసుకుంటున్న నీ పళ్ళ మధ్య నిప్పురవ్వల స్నేహం చేస్తున్నాయి. వేంకటేశ్వరా ! ఆ వేంకటాద్రిపైన ఉన్న ఆ నరసింహుడివి నీవే. వేంకటనారశింహా!!!వేంకటనారశింహా!!!

Friday, February 18, 2011

కోరిన కోరికలెల్ల

కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని
చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు

సుదతిమోవి తేనెలు సోమపానము నీకు
పొదుపైన తమ్ములము పురోడాశము
మదన పరిభాషలు మంచి వేద మంత్రములు
అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు

కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము
నలువైన గుబ్బలు కనక పాత్రలు
కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు
చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు

కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల
ఆముకొన్న చెమటలే యవబృథము
యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి
చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు

అర్ధం:
కొమ్మ: స్త్రీ
సుదతి: స్త్రీ
మోవి: పెదవి, అధరము
సోమపానము: విప్పతీగె రసము త్రాగుట (drinking the juice of the Asclepias)
తమ్ములము: తాంబూలము
పురోడాశము: యజ్ఞార్ధమైన అపూపము (యజ్ఞం నందు వండబడిన అప్పాలు వంటివి)
మదన పరిభాషలు: సరసమైన మాటలు
కామయజ్ఞము: స్త్రీ పురుషులు కలసి ఒక జీవికి ప్రాణంపోసే పరమ పవిత్రమైన యజ్ఞము
కలికి: అందమైన
పయ్యెద: వక్షస్థలమును కప్పు వస్త్రము 
కృష్ణాజినము: జింక చర్మము
నలువైన గుబ్బలు: అందమైన చనుమొనలు
కనకపాత్రలు: బంగారు పళ్ళెములు
కలసేటి సరసాలు: ఒకటయ్యే ఆటలు
కర్మ తంత్ర: యజ్ఞమునందు చేయవలసిన క్రియ
విభవాలు: సంపదలు
కామిని: కోరికతో నున్న స్త్రీ
కాగిని: కౌగిలి
యాగశాల: యాగము చేయు స్థలము
ఆముకున్న: అలముకున్న?
చెమటలు: శరీరము విడుచు నీరు
అవబృథము: యజ్ఞము చేయువారు చేయు చివరిరోజు స్నానము

భావం:
ఈ కీర్తన అన్నమయ్య శృంగార భక్తికి తార్కాణం. ఈ సృష్టికి మూలం స్త్రీ పురుషుల కలయిక. మన పూర్వీకులు ఈ ధర్మబద్ధమైన కలయికను పరమ పవిత్రమైన యజ్ఞంగా భావించేవారు. అందుకేనేమో మన పూర్వీకులు సౌశీల్యులు. నవరసాల్లో శృంగారానికి అత్యంత ప్రాధాన్యాన్నిచ్చారు. అన్నమయ్య అలమేలు మంగ, శ్రీనివాసులు సరససల్లాపాలను ఒక యజ్ఞంతో పోల్చుతూ ఈ కీర్తనలో వర్ణిస్తున్నారు. యజ్ఞం లో చేసే పనులకు కామయజ్ఞం లో చేసే పనులతో పోలికను చూపిస్తున్నారు.
ఆమెయందు కలిగిన కోరికలతో కామయజ్ఞం చేయవయ్యా నీవు!. తేనెలూరు ఆమె పెదవులు సోమపానము నీకు, (యజ్ఞం చేసేవారు విప్పరసము తాగుతారు. అది సారా కాదు. అప్పటుకప్పుడు తీసిన రసము శ్రేష్టమని చెప్పబడుచున్నది. ఈ రసమును పులియబెట్టినచో విప్పసారా గా రూపాంతరము చెందును). ఆమె నీ పక్కన కూర్చుని నీకందించే తాంబూలము పురోడాశము (యజ్ఞం నందు వండే అప్పాలవంటివి). మీ ఇద్దరి మధ్య జరిగే శృంగారభరితమైన మాటలు యజ్ఞంలో చదివే వేదమంత్రాల వంటివి. తన పయ్యెద (పైట) యజ్ఞం లో నీ మీద కప్పిన జింక చర్మము వంటిది. ఆమె యొక్క అందమైన చనుమొనలు యజ్ఞం నందలి బంగారు పాత్రల వంటివి. నీవు ఆమె తో కలిసే క్రియలు యజ్ఞం నందలి తంత్ర క్రియ మరియు సంపదల వంటివి. కామిని కౌగిలి నీకు గొప్పదైన యాగశాల. మీ ఇద్దరి శరీరాల కలయిక వల్ల వచ్చు చెమటలు యజ్ఞము చేయువారు చేయు చివరిరోజు స్నానమునకు ఉపయోగించు నీటివలే  ఉన్నది. శ్రీ వేంకటేశ్వరా! ఈ విధముగా నీవు నన్ను రక్షించితివి. నీవు మెచ్చిన నీ పడతితో కామయజ్ఞము చేయవయ్యా!!!!! 
ఈ కీర్తన  ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/a327b7f5-c660-4f26-8083-47b63a514239/03-KORINA

Thursday, February 17, 2011

నీవనగ నొకచోట

నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు
నీవనుచు కనుగొన్న నిజమెల్లనీవే

తనయాత్మవలెనె భూతముల యాతుమలెల్ల -
ననయంబు కనుగొన్న యతడే నీవు
తనుగన్నతల్లిగా తగని తర కాంతలను
అనఘుడై మదిజూచు నతడే నీవు

సతత సత్య వ్రతాచార సంపన్నుడై
అతిశయంబుగ మెలగునతడే నీవు
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు
హత కాముకుడైన యతడే నీవు

మోదమున సుఃదుఃఖముల నొక్కరీతిగా
నాదరింపుచునున్న యతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ
ఆదియును నంత్యంబు నంతయును నీవే

అర్ధం:
కాంతలు: స్త్రీలు
ఆతుమ: ఆత్మ
అనయము: నిరంతరము
అనఘుడు: పాపము లేని వాడు
మది: హృదయము
సతతము: ఎల్లప్పుడు
సత్య వ్రతాచార సంపన్నుడు: నిజమునే మాట్లాడువలెనను ఆచారము కలిగినవాడు
ధృతిదూలి:
ద్రవ్యము: సొమ్ము
తృణము: విలువలేనిది గా
హత కాముకుడు: కోరికలు లేనివాడు
మోదమున: సంతోషంగా

భావం:
ఓ వేంకటాచలనాధా! నీవు ప్రత్యేకంగా ఒక రాతి విగ్రహంలో ఒక్కచోట నిలచి ఉండట్లేదు. నేను గమనించే ప్రతీ నిజము లోనూ నువ్వున్నావు. ఎవడైతే ఇతరులలో తనను తాను దర్శించుకొను వాడు..ఏ జీవినీ హింసించని వాడు. అన్ని ప్రాణులలోనూ దైవాన్ని దర్శించేవాడుగా ఉన్నాడో ఆతడే నీవు. మనసులో ఎటువంటి పాపచింతన లేకుండా పర స్త్రీలను తన కన్నతల్లిగా చూచుకొను ఆ మహాత్ముడే నీవు. నిరతము సత్య సంభాషణము చేస్తూ నిగర్వియై నలుగురికీ సహాయము చేస్తూ ఉంటాడో ఆతడే నీవు. పరుల సొమ్మను ఆశించక, తన కష్టపడి సంపాదించిన ధనాన్ని తృణప్రాయంగా భావించి యే కోరికలు లేకుండా సాత్విక జీవనం సాగించే ఆతడే నీవు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా రెండింటినీ సంతోషంగా స్వీకరించే ఆ మహాత్ముడే నీవు. వేదాలలో కీర్తింపబడినటువంటి వేంకటాచలం పై నున్న శ్రీవేంకటేశ్వరా! ఈ సృష్టికి ఆది, అంతము నీవే.

ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://annamacharya-lyrics.blogspot.com/2008/09/532.html

Tuesday, February 15, 2011

దేవ దేవం భజే

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
 
వేంకటేశం సాధు విబుధ వినుతం


ప్రతిపదార్ధం:
దేవ దేవ: దేవదేవుడు
దివ్యప్రభావ: దివ్య ప్రభావుడు
రావణాసురవైరి: రావణాసురుని శత్రువు (రాముడు)
రణపుంగవ: యుద్ధరంగమునందు వీరుడు
భజే: భజింపుము


రాజవరశేఖర: రాజవరులలో ఉత్తముడు
రవికులసుధాకర: రఘువంశమనే సముద్రంలో ఉద్భవించిన సూర్యుడి వంటి వాడు??(సుధాకర: అంటే అమృతానికి నిలయుడు, కాబట్టి సముద్రుడు)
ఆజానుబాహు: పొడవైన చేతులు కలవాడు (నిలబడినప్పుడు చేతి వ్రేళ్ళు మోకాలికి తగులుతుంటే వాళ్లని ఆజానుబాహుడు అంటారు ట)
నీలాభ్రకాయ: నీలాకాశం వలే నల్లని దేహం కలవాడు
రాజారి కోదండ రాజ దీక్షాగురు : రాజులకు శత్రువైన పరశురాముని శివధనస్సును విరిచి ఆతని గర్వము భంగము చేసినవాడు
రాజీవలోచన: రాజీవం అంటే నీలం రంగులో నున్న కలువ. అంటే నీలపు కలువ కన్నులు గలవాడు
రామచంద్ర: రామచంద్రుడు


నీలజీమూత సన్నిభశరీర: వర్షాకాలపు నల్లని మబ్బు (నీల జీమూత) తో సమానమైన (సన్నిభ) శరీరం కలవాడు
ఘనవిశాలవక్షం: గొప్ప విశాలమైన చాతీ కలవాడు
విమల : స్వచ్చమైన
జలజనాభ: పద్మమును నాభి (బొడ్డు) యందు కలిగిన వాడు
తాలాహినగహర: పాములకి శత్రువు ఐన గరుడుడు వాహనం గా కలవాడు?? (ఈ ప్రయోగం అర్ధం చేసుకోవడం కష్టం గా ఉంది)
ధర్మసంస్థాపన: ధర్మ సంస్థాపకుడు
భూలలనాధిప: భూమి కి పతి ((సీత కూడా భూమి నుంచి పుట్టింది కాబట్టి- సీతాపతి)
భోగిశయ: భోగి అంటే పాము. శేషశయన అని అర్ధం .


పంకజాసనవినుత: పంకజము (పంకము అంటే బురద, జ అంటే పుట్టినది =పద్మము), పద్మాసనుడు బ్రహ్మ. బ్రహ్మగారిచే నిత్యము కీర్తింపబడేవాడు
పరమనారాయణ: నారాయణుడు
శంకరార్జిత జనక చాపదళనం: శంకరుని వద్దనుండి పొందబడిన జనకుని యొక్క దనస్సును ఎక్కుబెట్టినవాడు/విరిచినవాడు
లంకా విశోషణ: లంకను జయించిన వాడు
లాలితవిభీషణ: విభీషణుని రక్షించినవాడు
వేంకటేశం సాధు విబుధ వినుతం: సాధువులు, పండితులచే కీర్తింపబడే వేంకటేశుడు
ఈ కీర్తన ఇక్కడ వినండి. 
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/53devadevambhajedivyaprabhavam.html

చూచి వచ్చితి

చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా
లలితాంగి జవరాలు లావణ్యవతి ఈకె
కలువకంఠి మంచి కంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుఁబోడిచక్కదనమిట్టిదయ్యా
అలివేణి మిగులనీలాలక శశిభాల
మలయజగంధి మహామానిని యీకె
పెలుచుమరునివిండ్లబొమ్మలది చారుబింబోష్ఠి
కని(లి?)తకుందరద చక్కందనమిట్టిదయ్యా

చెక్కుటద్దములది శ్రీకారకన్న(ర్ణ?)ములది
నిక్కుఁజన్నులరంభోరు నిర్మలపాద
గక్కన శ్రీవేంకటేశ కదిసె లతాహస్త
దక్కె నీకీ లేమ చక్కందన మిట్టిదయ్యా

పదార్ధం:
లలితాంగి: మనోహరమైన
జవరాలు: ప్రేమించిన యువతి
లావణ్యవతి: సుందరమైన
ఈకె: ఈ అమ్మాయి (ఈపె అని కూడా అనొచ్చు)
కలువకంటి: కలువ రేకుల వంటి కన్నులు కలది
కంబుకంఠిశంఖము వంటి కంఠము కలిగినది
జలజవదన: పద్మము వంటి విచ్చుకున్న మోము కలిగినది
చక్ర జఘన: చక్రము  వంటి కటి భాగము (మొల)
సింహమధ్య: సింహము వలె సన్నని నడుము గలది
తలిరుబోడి: తలిరు అంటే చిగురు. కాబట్టి చిగురుబోడి. స్త్రీ కి పర్యాయపదం.
అలివేణి: స్త్రీ
మిగుల నీలాలక = = అతిశయించిన నల్లని కురులు కలది
శశిభాల: తెల్లని ఫాలభాగము(నుదురు) కలది
మలయజగంధి: గంధపు వాసన గలది
మహా మానిని: గొప్ప మానము కలిగిన ఆడది. స్త్రీ కి పర్యాయపదం
మరుని విండ్ల బొమ్మలది: మన్మధుని బాణము వలె కనుబొమ్మలు కలది??
చారు బింబోష్టి: అందమైన/రస పూరితమైన పెదవులు కలిగినది (పెదవులు ఎర్రని దొండపండ్ల వలే ఉన్నవి)
కలితకుందరద: మొల్లపువ్వుల వలె తెల్లగా మెరిసే పలువరస కలది, అపరంజి,
చెక్కుటద్దములది: అద్దము వలె నున్నటి బుగ్గలు కలిగినది. చెక్కు అంటే నుదురు అని కూడా అర్ధం. కానీ చెక్కులు అన్నారు కాబట్టి బుగ్గలే అయ్యుంటాయి.
శ్రీకార కర్ణములది: చెవులు "శ్రీ" ఆకృతి లో కలిగినది
నిక్కు చన్నులు: నిగిడిన (కొంత ఉద్రేకపడిన) స్తనములు (వక్షోజములు)
రంభోరు: అరటిచెట్టు వంటి ఊరువులు (తొడలు) కలిగినది
నిర్మలపాద: స్వచ్చమైన పాదాలు కలది. అంటే లేత మామిడి ఆకుల్లా చిరు ఎర్రగా అనుకోండి.
గ్రక్కన: శీఘ్రముగా
కదిసె: పట్టుకొనుట, చేపట్టుట??(కదియు == చేరు, పొందు, సాటియగు, సమీపించు)
లతాహస్త: తీగె వంటి చేయి
నీకీ లేమ దక్కె: లేత అమ్మాయి (స్త్రీ కి మరొక పర్యాయ పదం)  నీకు దక్కినది.

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరునకు పెండ్లి కుమార్తెను వెతికి వచ్చు వానిగా తనను తానూహించుకుని రాసిన కీర్తన. ఇది మధుర భక్తికి తార్కాణం. పల్లవిలో ప్రభూ! ఓ అమ్మాయిని చూసి వచ్చాను. అంతేకాదు నీవున్న చోటికి వెంటబెట్టుకుని వచ్చాను. నువ్వు నిర్ణయించి పెండ్లాడు ఈమెను అంటూ ఆ అమ్మాయి అందం ఎలా ఉందో మిగతా చరణాల్లో వర్ణించాడు.
చాలామంది అన్నమయ్య సంకీర్తనల్లో పచ్చి శృంగారం ఉంది. అని చాలా వ్యంగ్యంగా మాట్లాడటం విన్నాను. అవును మరి. శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలయికగా చూసేవారికి అంతకన్నా గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి. మనం ఎలా ఆలోచిస్తే అలాగే కనబడతాయి అన్నీ. తరువాతలో అన్నమయ్య వైరాగ్యాన్ని చూద్దాం. 
ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగు నుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/88d6733e-2312-42ea-b3b1-a2b7aa84accb/cUcivacciti_nIvunna_cOTikE

చిన్ని శిశువు

చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు ||

తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడల గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోద వెంట పారాడు శిశువు ||

ముద్దుల వ్రేళ్ళాతోడా మొరవంక యుంగరాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు ||

బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చెలగి నేడిదే వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు ||


ప్రతిపదార్ధం:
తోయంపుకురులు: తోయము అంటే నీరు. తోయంపు కురులు అంటే నల్లని కురులేమో?.(బహుశా అది " తోయము " కాకుండా " తోరము " అయి ఉండవచ్చునేమో. తోరము = పొడవు, గుబురు, లావు, బలిష్ఠము అనే అర్థాలు ఉన్నాయి. అవి భావానికి చక్కగా సరిపోతాయి. ప్రాస మాత్రం సరిపోదు. ఆ కాలంలో వాడే భాష, యాసలో "తోయము" అని వాడవచ్చేమో పరిశీలించాలి :భైరవభట్ల విజయాదిత్య ) 
పాయక: విడువకుండా
పారాడు: పాకుతూ ఆడు
నిద్దపు చేతులు: నున్నటి చేతులు
పైడి బొద్దుల తోడ: బంగారు ఆభరణాల (చేతికి పెట్టుకునేవి =కంకణాలు) తో
అద్దపు చెక్కులు: అద్దము వలె నున్న బుగ్గలు. చెక్కు అంటే నుదురు అని కూడా అర్ధం. కానీ చెక్కులు అన్నారు కాబట్టి బుగ్గలే అయ్యుంటాయి.
అప్పలప్పలని నంత: చిన్న పిల్లలు అప్ప, అప్ప అని చేసే శబ్దము 
గద్దించి: బెదురుతూ
బలుపైన పొట్ట: భారమైన ఉదరము
నులివేడి వెన్న: గోరువెచ్చని వెన్న
చెలగి: ఉద్భవించుట

భావం: బాలకృష్ణుని అందాన్ని అన్నమాచార్యులు ఎంత అందం గా వర్ణించారో చూడండి. ఈ శిశువు ఎవరూ ఎన్నడూ ఎక్కడా చూడనటువంటి చిన్ని శిశువు. నల్లని కురులతో తూగుతున్నటువంటి, చింతకాయల వలె జడలు కట్టి వ్రేలాడుతున్నటువంటి శిరసు, పాదాలకు బంగారపు మువ్వల పట్టీలు పెట్టుకుని, యశోద వెంటే తిరుగుతూ పాకుతూ ఆడుకునే శిశువు.  ముద్దులొలికే వేళ్ళతో, వాటికి బంగారపు ఉంగరాలతో, నున్నటి చేతులతో, చేతికి బంగారు కంకణాలతో, అద్దము వలే చెక్కినటువంటి లేత బుగ్గలతో, అప్ప, అప్ప అంటూ బెదురు నటిస్తూ యశోద శరీరాన్ని గదమాయిస్తూ కౌగిలించినట్టి శిశువు. బరువైన గట్టి పొట్టమీద, అప్పుడే తాగినటువంటి పాలచారల తో, గోరు వెచ్చని వెన్న తిన్న నోటి తో, శ్రీ వేంకటాద్రి మీద ఉద్భవించి ఈ లోకాలనన్నింటిని కాపాడుతూన్నటువంటి శిశువు. ఆతడే వేంకటాద్రి బాలకృష్ణుడు.  


ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/81071a87-f0e7-414b-9de4-bb4c3735f7b5/ChinniSisuvu_BKP/?widget=flash_player_note

Monday, February 14, 2011

నెలమూడు శోభనాలు

ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు 
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను 
చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు  
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు  
కరిగాచెదాను నీవు కరియానవు 
సరి జలధిశాయి జలధికన్యవు నీవు  
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు 
అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె 
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||
ప్రతిపదార్ధం:
నెలమూడు: కలకాలం????
శోభనమ్: మంగళము దీన్నే సోబనము అని కూడా అంటారు.
రామ: అందమైన స్త్రీ
చామ: యౌవ్వనవతి ఐన స్త్రీ
వామనయన: మంచి కన్నులు కలిగిన స్త్రీ
హరిణేక్షణ: జింక వంటి చోపులు కలది??
కరియానవు: కరి అంటే ఏనుగు. యానము అంటే ప్రయాణము. అంటే గజగమన అని అర్ధం.
జలధికన్యవు: జలధి అంటే సముద్రం. కాబట్టి సముద్రుడి కూతురు
జలజముఖి: పద్మము వంటి విచ్చుకున్న ముఖం కలది.
బెరసి/వెరసి: లెక్క మొత్తానికి
నిన్నురాన మోచె: నిన్ను ఉరమున (వక్షస్థలమున) మోచె/ఉంచె/మోయుచున్నాడు


భావం:
ఈ సంకీర్తన చూస్తే అన్నమయ్య మధుర భక్తి ఎటువంటిదో తెలుస్తుంది. పద్మావతి వేంకటేశ్వరులకు పెండ్లి చేయడానికి వారిద్దరికీ పేరు బలం చూస్తున్నాడన్నమాచార్యులు. సాధారణంగా మన మనుష్యుల్లో ఐతే అబ్బాయికీ, అమ్మాయికీ పెండ్లి చేయాలంటే వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతకచక్రాన్ని వేసి రాశి బలం, మైత్రీ బంధం, జాతకాలు కలిశాయా లేదా?, వారి సంతాన యోగం, అమ్మాయికి సౌభాగ్యస్థానం అన్నీ గణించి వారిరువురూ వివాహానికి యూగ్యులా కాదా అని నిర్వహిస్తారు. కానీ! పద్మావతీ శ్రీనివాసుల జన్మ నక్షత్రం ఎవరికి తెలుసు? వారి పుట్టుక ఎవరికి తెలుసు? జన్మనక్షత్రమే లేనప్పుడు జాతకం ఎలా?. కాబట్టి అన్నమయ్య అలమేలు మంగ, శ్రీనివాసుల పేర్ల బలం గణించి వారిరువురి వివాహ జీవితం అత్యద్భుతంగా ఉంటుందని. నిరంతరం వారి వైవాహిక జీవితం మంగళప్రదంగా ఉంటుందని తేల్చుతున్నారు.  


అతని పేరు త్రేతాయుగంలో రాముడు. నీవు రామవు (అందమైన స్త్రీవి). అతను కొంచెం చామన వర్ణం (కొంత నల్లని రంగు). నీవు చామవు (యౌవ్వనవతి వి). అతని వామనుడు అని కూడా అంటారు. నీవు వామనయనవు (మంచి కన్నులు కలిగిన స్త్రీవి). ఈ విధంగా మీ ఇద్దరికీ పేరు బలం ఒకటే.
అతని పేరు హరి. నీవు అందమైన తెల్లని కన్నులు కలదానవు/జింకవంటి చూపులు కలదానవు. అతను కరి (యేనుగు) ను రక్షించిన వాడు (గజేంద్రమోక్షం). నీవు కరియానవు (గజగామినివి) (యేనుగు వలే గంభీరమైన మందమైన నడక గలదానవు). అతను పాల సముద్రంలో శయనించేవాడు. నీవి ఆ సముద్రూడి కూతురివి. మొత్తానికి మీ ఇద్దరికీ పేరు బలం ఒక్కటే.
అతను జలజనాభుడు (పద్మము నాభి యందు కలవాడు). నీవు జలజముఖివి (పద్మము వంటి ముఖం కలదానవు). నీవు అలమేలుమంగవు ( తమిళంలో అలర్ అంటే పువ్వు. మేల్ అంటే మీద. మంగై అంటే కన్యక. అలమేలు మంగ అంటే పువ్వుమీద కన్యక. పువ్వే సున్నితం. పువ్వుమీద కన్యక అంటే ఆవిడ సున్నితత్వాన్ని ఎంతని చెప్పగలం?). నిన్ను అలముకున్నాడతడు. ఇలలో శ్రీ వెంకటేశుడు నిన్ను తన వక్షస్థలంలై ఉంచుకుని లోకాలను ఏలుతున్నాడు. ఈ విధంగా మీ ఇద్దరికీ అద్భుతమైన పేరు బలం ఉంది కాబట్టీ మీ వైవాహిక జీవితం సుఖసంతోషాలకు నెలవౌతుందని అన్నమయ్య అంటున్నారు. 

ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగు నుండి గ్రహింపబడినది.
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/358nelamudu-sobanalu.html


Thursday, February 10, 2011

స్త్రీ అనే పదానికి ఎన్నో పర్యాయపదాలు

అన్నమయ్య కీర్తనల్లో "స్త్రీ" అనే పదానికి ఎన్నో పర్యాయపదాలు వాడారు. అవి యేమిటో తెలుసుకుంటే కీర్తనను అర్ధం చేసుకోవడం కొంత సులభమౌతుంది. అవేంటో ఈ క్రింద చూడండి.
అంగన, అతివ, ఆడది, ఇంతి, ఉవిద, కలికి, కళ్యాణి, కాంత, కొమ్మ, కోమలి, గాల, చాన, చెలువ, చేటి, చేదియ, చిగురుబోడి, జవ్వని, తన్వి, తరుణి, తలిరుబోడి, తెలువ, నాటి, నారి, నవల, నెలత, పడతి, ప్రమద, పెంటి, పైదలి, భామ, భామిని, మహిళ, మగువ, మానిని, ముదిత, ముగుద, మెలత, యువతి, యుగ్మలి, యోష, రత్న, రమణి, లలన, లలామ, లేమ, వనిత, వదుతి, వెలది, సుదతి. 

Saturday, February 5, 2011

Introduction

ఫ్రియమైన మిత్రులకు,
నమో నారాయణాయ!
అన్నమయ్య సంకీర్తనల్లోని ఆధ్యాత్మిక, శృంగార, వైరాగ్య, నీతి తత్వాలు మనకు  ఎనలేని ఆనందాన్ని, వేంకటేశ్వరునిపై అపార భక్తిని పెంపొందిస్తాయి. ఐతే, నిజానికి అన్నమయ్య చాలా కీర్తనలు పామర భాషలోనే రాసినా, మనం ఇప్పుడు వాడే తెలుగు కాలంతో పాటే పల్చబడిపోవడంతో ఆయన వాడిన పదాలు మనకి అర్ధం కావడం కష్టమైపోతోంది. నాకు కొన్ని కీర్తనలు అర్థం పూర్తిగా (ప్రతీ పదానికీ) తెలుసుకున్నప్పుడు నా మనస్సు బయటకు వ్యక్తం చేయలేనంత ఆనందాన్ని పొందుతుంది. కన్నుల వెంబడి కన్నీళ్ళు ధారల్లా వచ్చేస్తాయి. కేవలం చదివి అర్థం చేసుకునే నాకే ఇలా ఉంటే వాటిని రచించి, పాడుకున్న అన్నమయ్య ఎంత సంబరపడి ఉంటాడు. ఆయన పాడుతున్నప్పుడు విని ఆనందించిన తిరువేంకటపతి ఎంత సంతోషించి ఉంటాడు?. ఆయన ఆతుమను తనలో కలుపుకున్నప్పుడు ఎంత ఆవేదన చెంది ఉంటాడు?.
ఈ బ్లాగ్ లో నాకు నచ్చిన చాలా కీర్తనలకి ప్రతీ పదానికి అర్ధాన్ని, తద్వారా భావాన్ని ఇక్కడ పొందుపరచాలనుకుంటున్నాను. ఇది కేవలం శ్రీ వారి సేవలో భాగం, అన్నమయ్య సంకీర్తనలు అందరూ తెలిసికొని, వాటి అర్ధాలను అవగహన చేసుకుని, ఆధ్యాత్మికానందంలో ఓలలాడాలని నా ఆకంక్ష. రోజుకొక సంకీర్తన చొప్పున ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను.  సహకరించ మనవి.  
ధన్యవాదములు
కిరణ్